ఎస్పీవైకి పైపుల రెడ్డి అనే పేరుందని తెలుసా ?

చికిత్స చేయించుకుంటు మంగళవారం మరణించిన నంద్యాల ఎంసి స్పీవై రెడ్డికి మరో పేరు కూడా ఉంది. అదే పైపుల రెడ్డి అని. బాగా సన్నిహితులు, సామాన్య జనాలు ఎస్పీవైని పైపుల రెడ్డి అని ముద్దుగా పిలుచుకుంటారు. అలా ఎందుకు పిలుస్తారంటే నంది పైపుల ఫ్యాక్టరీ ఎస్పీవై రెడ్డిదే కాబట్టి. పివిసి పైపులను తయారు చేసి దేశంలోని చాలా రాష్ట్రాలకు సరఫరా చేసేవారు.

ప్లాస్టిక్ పైపులపై పెద్దగా అవగాహన లేని 1984 లోనే రెడ్డి పైపులు తయారు చేసి సక్సెస్ సాధించారు.  బావులు, చెరువుల్లో నుండి నీళ్ళు తోడి పంటలకు లేకపోతే ఇతర ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలంటే అప్పట్లో రబ్బర్ ట్యూబులే గతి. అవేమో తొందరగా చిరిగిపోయేవి. రబ్బర్ ట్యూబులకు ప్రత్యామ్నాయం లేక రైతులు, పారిశ్రామికవేత్తలు, నిర్మాణ రంగం  ఇబ్బందులు పడుతున్న సమయంలోనే రెడ్డి నంది పైపుల ఉత్పత్తి ప్రారంభించటంతో తొందరలోనే పాపులరైంది.

వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన రెడ్డి బాబా అటామికర్ రీసెర్చ్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో అయితే చేరారు కానీ రెడ్డి దృష్టంతా వ్యాపారం మీదే. అందుకనే తొందరలోనే ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. రూ 175 చేతిలో పెట్టుకుని కర్నూలు జిల్లాలోని నంద్యాలలో 1979లో ప్లాస్టిక్ కంటైనర్ల ఉత్పత్తి ప్రారంభించారు. తర్వాత మెల్లిగా 1984లో నందిపైపుల ఉత్పత్తి ప్రారంభించారు.

నందిపైపుల ఫ్యాక్టరీలో సాధించిన లాభాలతోనే విద్యా సంస్ధలు ఏర్పాటు చేశారు. పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని కూడా కొన్నారు. అయితే సిమెంట్ ఫ్యాక్టరీ దెబ్బతినేయటంతో మూసేశారు. నంది ఆగ్రోస్ పేరుతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించారు. మెల్లిగా అనుబంధ సంస్ధగా లిక్కర్ బాట్లింగ్ యూనిట్ ను కూడా ప్రారంభించారు. తర్వాత నంది పేరుతోనే డైరీ సంస్ధను కూడా ప్రారంభించారు. కర్నూలు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నంది పాల ఉత్పత్తి కేంద్రం బాగా పాపులరైంది.

పారిశ్రామికంగా పేరు తెచ్చుకున్న తర్వాత రెడ్డి చూపు రాజకీయాలవైపు మళ్ళింది. రెడ్డి రాజకీయ అరంగేట్రం బిజెపితోనే మొదలైంది. 1991లో నంద్యాల ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 1999లో నంద్యాల అసెంబ్లీతో పాటు ప్రకాశం జిల్లాలోని  గిద్దలూరు అసెంబ్లీకి కూడా పోటీ చేసి ఓడిపోయారు.

తర్వాత 2003లో కాంగ్రెస్ పార్టీలో చేరిన రెడ్డి నంద్యాల మున్సిపల్ ఛైర్మన్ గా గెలిచారు. అక్కడి నుండి రెడ్డి తిరిగిచూసుకోలేదు. 2004, 2009లో కాంగ్రెస్ ఎంపిగా 2014లో వైసిపి ఎంపిగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేశారు.