తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై పార్లమెంట్ లో మళ్లీ గళమెత్తనున్నారు. అవిశ్వాస చర్చలో ప్రధానమంత్రి ఇచ్చిన సమాధానాలపై విపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. తమ ధర్మపోరాటాన్ని కొనసాగించాలని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేయాలని అలాగే సభ లోపల ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపాలని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. తమ పోరాటంతో మోదీ సర్కార్ పై మరింత ఒత్తిడి పెంచాలని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. హోదా విషయంలో మోదీ ఇప్పటికే చేతులేత్తయడంతో స్పష్టమైన వైఖరి చెప్పాలని వారు డిమాండ్ చేయనున్నారు.
అవిశ్వాసం మీద జరిగిన చర్చలో ప్రధాని ఏపికి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి వైఖరి ప్రకటించలేదు. దీంతో ఎంపీలతో పాటు ఏపి ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. సీఎం చంద్రబాబు డిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడి కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మోసగానిలా ప్రవర్తించాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలలో అసహనం, కోపం, బాధ ఉందని దీంతో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గొద్దని కేంద్రంపై ధర్మపోరాటం చేయాల్సిందేనని టిడిపి ఎంపీలు నిర్ణయించారు. కేంద్ర వైఖరి నిరసనగా వైసిపి అధినేత జగన్ మంగళవారం ఏపి బంద్ కు పిలుపునిచ్చారు.