టీడీపీ ఎంపీలకు ఊహించని షాక్

దేశరాజధాని ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో పార్లమెంటు వాతావరణమంతా హాట్ హాట్ గా మారింది. ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ ఎంపీలకు లోక్ సభలో ఊహించని షాక్ తగిలింది.

సభ మొదలవగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టారు. వెల్ లోకి వెళ్లి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు. వీరితోపాటు అన్నాడీఎంకే ఎంపీలు కూడా ఆందోళన చేస్తూ వెల్ లోకి వెళ్లారు. ఈ తరుణంలో 12 మంది టీడీపీ ఎంపీలకు, 9 మంది అన్నాడీఎంకే ఎంపీలకు ఊహించని షాక్ ఇచ్చారు స్పీకర్ సుమిత్ర మహాజన్. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

వెల్ లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేసిన ఎంపీలకు సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్. వీరిని నాలుగు రోజులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. సస్పెండ్ అయిన టీడీపీ ఎంపీలలో.. అశోక్ గజపతిరాజు, గల్లాజయదేవ్, మాల్యాద్రి శ్రీరామ్, అవంతి శ్రీనివాస్, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్ రెడ్డి, మురళి మోహన్, తోట నరసింహం, బుట్టా రేణుక, రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప ఉన్నారు.

అయితే గతంలో ఎన్నిసార్లు వెల్ లోకి వెళ్ళినా సస్పెన్షన్ వేయలేదు. కానీ ఇటీవల జరిగిన బిఎస్సి సమావేశంలో జనవరి 1 నుండి వెల్ లోకి వచ్చి నిరసన చేపట్టేవారిని సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 374 ఏ సెక్షన్ ప్రకారం ఆందోళన చేపట్టిన టీడీపీ ఎంపీలను, అన్నాడీఎంకే ఎంపీలను 4 రోజులపాటు సస్పెండ్ చేసారు స్పీకర్.