పక్కా ప్లాన్ ప్రకారమే బిజెపిలోకి టిడిపి ఎంపిలు

చాలామంది అనుకుంటున్నట్లు నలుగురు ఎంపిలు బిజెపిలో చేరటం చంద్రబాబునాయుడుకు షాక్ కానేకాదు. పైగా చంద్రబాబు ప్లాన్ ప్రకారమే అంతా సవ్యంగా జరిగిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగరు బిజెపిలో చేరిన తర్వాత టిడిపిలో పెద్దగా ప్రతికూల స్పందనే కనబడలేదు.

అదే సమయంలో ఈ విషయం తమకు ముందే తెలుసు అన్నట్లుగా చాలామంది నేతలు ఈ విషయాన్ని పట్టించుకోనేలేదు. పైగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కూడా ఫిరాయింపులపై ఏదో మొక్కుబడి ప్రకటన ఇచ్చి చేతులు దులిపేసుకున్నట్లే కనబడుతోంది. మామూలుగా అయితే టిడిపి నుండి ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే పార్టీ నేతలు పెద్ద రచ్చే చేసేస్తారు. అలాంటిదేమీ ఇపుడు కనబడకపోవటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయ్.

నిజానికి బిజెపిలో చేరిన నలుగురు ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లో మొదటి ముగ్గురు చంద్రబాబుకు బినామీలుగా ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. ఆరునూరైనా సరే వాళ్ళు చంద్రబాబును వదిలి ఇంకో పార్టీలో చేరే సమస్యే లేదని టిడిపి నేతల్లోనే బలమైన నమ్మకముంది. అలాంటిది ఏకంగా ముగ్గురు బిజెపిలో చేరారంటే తెరవెనుక జరిగిన ప్లాన్ ప్రకారమే చేరారనే అనుమానాలున్నాయి.

బిజెపిలో చేరిన నలుగురు ఎంపిల్లో ఇద్దరిపై ఇప్పటికే సిబిఐ, ఈడి, ఐటి దాడులు జరిగాయి. సుజనా పీకల్లోతు కేసుల్లో ఇరుకునున్నారు. సిఎం రమేష్ కూడా ఇరుక్కోవటం ఖాయమనే అనిపిస్తోంది. పైగా గడచిన ఐదేళ్ళ టిడిపి పాలనలో జరిగిన అవినీతిపై జగన్ విచారణ జరిపిస్తే చంద్రబాబుకు కూడా కష్టాలు తప్పవు. అందుకనే ముందుజాగ్రత్తగా చంద్రబాబే తన మనుషులను బిజెపిలోకి పంపారనే ప్రచారం టిడిపిలోనే జరుగుతోంది. కాబట్టి ఇదేమీ చంద్రబాబుకు షాక్ కాదు.