స్పృహ తప్పిన కోడెల ? డ్రామానా ? నిజమేనా ?

స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పృహతప్పి పడిపోయారా ? అవుననే అంటున్నారు టిడిపి నేతలు. అసలేం జరిగిందంటే, సత్తెనపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలోని ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం 139లోకి కోడెల తన భద్రతా సిబ్బంది, మద్దతుదారులతో వెళ్ళారు. నిజానికి అభ్యర్ధులు మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళవచ్చు. అయితే కోడెల మాత్రం మద్దతుదారులు, భద్రతా సిబ్బందిని కూడా తీసుకెళ్ళారు.

పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన కోడెల వెంటనే తలుపులు మూసేశారు. లోపలేం జరుగుతోందో బయటున్న ఓటర్లకు అర్ధం కావటం లేదు. లోపలున్న వైసిపి పోలింగ్ ఏజెంట్లు గట్టిగా అరుస్తున్నారు. తలుపులు తీసి కోడెలను బయటకు వెళ్ళిపోవాలంటూ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కోడెల తలుపులు తీయలేదు, బయటకు రాలేదు.

కాసేపయిన తర్వాత హఠాత్తుగా తలుపులు తీసుకుని బయటకు వచ్చిన కోడెల వెంటనే పడిపోయారు. లోపలేం జరిగిందో ? బయటకు రాగానే ఎందుకు పడిపోయారో భగవంతుడికే తెలియాలి. అందుబాటులో ఉన్న సమాచారం ఏమిటంటే, పోలైన ఓట్లలో అత్యధికం కోడెలకు వ్యతిరేకంగానే పడ్డాయట. ఎలాగైనా గెలవాలన్న పట్టుదల మీదున్న కోడెలకు జరుగుతున్న పోలింగ్ లో చుక్కలు కనబడుతున్నాయట.

దాంతో నేరుగా  పోలింగ్ కేంద్రానికే వెళ్ళి కొందరు పోలింగ్ ఏజెంట్లతో బేరాలు పెట్టారని సమాచారం. అయితే తన బేరాలు వర్కవుట్ కాకపోవటంతో చివరి అస్త్రంగా స్పృహ తప్పిపడిపోయినట్లుగా కోడెల డ్రామాలాడుతున్నారని వైసిపి నేతలు మండిపడుతున్నారు.