తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.! అభ్యర్థులు తాము పోటీ చేసిన నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ప్రచార పర్వం ముగిశాక కూడా తీరిక లేకుండా, నియోజకవర్గాల్లో పెద్దయెత్తున డబ్బులు ఖర్చు చేసిన అభ్యర్థులు, ఎన్నికల ఫలితాల కోసం కంటి మీద కునుకు లేకుండా అప్పటివరకూ ఎదురుచూడాల్సిందే.
ఇది నాణేనికి ఓ వైపు.! ఇంకో వైపు, మీడియాలో జరుగుతున్న విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్ ఫలితాల రచ్చ.. అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకీ, కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఏం జరిగింది.? జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ పరిస్థితేంటి.?
కూకట్‌పల్లి నియోజకవర్గం మీదనే చర్చ ఎందుకు.? అంటే, ఇక్కడ ఈక్వేషన్స్ చాలా చాలా భిన్నమైనవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం వున్న నియోజకవర్గం ఇది. బీజేపీ – జనసేన పొత్తులో భాగంగా, జనసేన అభ్యర్థి పోటీ చేసిన నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలో టీడీపీ అనుకూల ఓట్లు ఎక్కువగా వున్నాయి.
అన్నిటికీ మించి, ‘కమ్మ’ సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ ఎక్కువ.. అన్న ప్రచారం వుండనే వుంది.! కూకట్‌పల్లిలో జనసేన కంటే, బీజేపీకి కాస్త ఎక్కువ ఓట్లు పడే అవకాశం వుందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. కానీ, జనసేన కోసం బీజేపీ ఈ సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. ఇదే నియోజకవర్గంలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే, బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యింది.
కానీ, ఇప్పుడు సీన్ మారింది.! పోలింగ్ రోజున, పోలింగ్ బూత్స్‌కి సమీపంలో జనసేన హంగామానే లేకుండా పోయింది. అదే బీజేపీ గనుక బరిలో వుంటే, సీన్ ఇంకోలా వుండేదే. గెలుపోటముల సంగతి తర్వాత, ఒకింత సందడి అయినా వుండాలి కదా.! ‘బీజేపీ అయితే గెలిచేది..’ అన్న చర్చ చాలా పోలింగ్ బూత్స్ దగ్గర కూకట్‌పల్లిలో జరగడం గమనార్హం.