బీజేపీ-జనసేన కాపురంపై వీర్రాజు కామెంట్స్ ఇవి!

ఏపీలో రాజకీయ పండితులకు, రాజకీయ విశ్లేషకులకు సైతం పూర్తిగా అర్థంకాని విషయం ఏదైనా ఉందంటే… అది కచ్చితంగా “బీజేపీ – జనసేన”ల పొత్తు వ్యవహారమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే… ఈ పార్టీలు రెండూ నిజంగా పొత్తులో ఉన్నాయా అంటే.. ఉన్నాయనేది బీజేపీ సమాధానం! ఈ రెండు పార్టీలూ పొత్తులో లేవా అంటే… జనసేన సమాధానం దాటవేత! ఈ పరిస్థితుల్లో తమ కాపురంపై స్పందించారు సోము వీర్రాజు!

“ఏపీలో తమ కాపురం ఇంకా సజావుగానే సాగుతోంది” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న ఆయన.. జనసేనతో బీజేపీ కాపురం బాగుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన శ్రేణులు బీజేపీ అభ్యర్థికే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో… జనసేనతో పొత్తు కొనసాగుతోందని స్పష్టం చేస్తున్న వీర్రాజు… ఈ విషయం.. వారాహి వాహన ప్రారంభోత్సవంలో పవన్ కల్యాణే చెప్పారన్న విషయం గుర్తుచేస్తున్నారు సోము వీర్రాజు.

కాగా… ఏపీలో రాబోయే ఎన్నికల్లో బ్రతిమాలో – బామాలో ఏదోలా జనసేనతోనే కలిసి పోటీచేయాలని.. ఆ కాపురం పచ్చగా సాగాలని బీజేపీ నేతలు భావిస్తుండగా… జనసేన మాత్ర బీజేపీతో బలవంతపు కాపురానికి స్వస్థి చెప్పి.. టీడీపీతో సహజీవనం చేయాలని చూస్తుందని..- బాబు కూడా పవన్ తోనే ప్రయాణించాలని భావిస్తున్నారని.. రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే! అయితే… ఈ విషయంపై సోము వీర్రాజు స్టేట్ మెంట్ కి 14న జరగబోయే ఆవిర్భావ సభలో పవన్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!