పవన్ కు కొత్త టెన్షన్: చంద్రబాబుపై వీర్రాజు సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో అధికార పార్టీ మినహా మిగిలిన మూడు పార్టీల పరిస్థితి ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. ఒకపక్క బీజేపీ-టీడీపీలో పొత్తు పెట్టుకుంటాయని, ఇందులో భాగంగా జనసేనను కూడా కలుపుకుంటాయని కథనాలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో స్పష్టత ఇవ్వని బీజేపీ నేతలు… తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని నొక్కి చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ తాజాగా చంద్రబాబుపై ఫైరయ్యారు సోము వీర్రాజు.

అవును… తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే.. అంటూ మొదలుపెట్టిన వీర్రాజు… ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడిని.. కేంద్రంలో చక్రం తిప్పానంటాడుగా.. మరి అప్పుడు రైల్వేజోన్‌ ఎందుకు తేలేకపోయాడు అంటూ ఎద్దేవా చేశారు. అనంతరం.. నోటాతో పోటీపడే పార్టీ అని బీజేపీని వెక్కిరించిన నోటితోనే… ఇప్పుడు పొత్తు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటూ నిలదీశారు.

చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని.. ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించటం సరికాదని సోము వీర్రాజు హితవు పలికారు. దమ్ముంటే.. చంద్రబాబు ముందుకు వస్తే ఒకే వేదికపై చర్చకు సిద్ధమని సోము ఛాలెంజ్ చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రావద్దన్నారని.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఏపీలోకి అనుమతించలేదని మండిపడ్డారు. ఇన్ని చెప్పిన సోము… చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారని, పొత్తులపై వారే నిర్ణయం తీసుకుంటారని చెప్పడం గమనార్హం.

అంతకు ముందు యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్న లోకేష్ పైనా వీర్రాజు ఫైరయ్యారు. అవును… నారా లోకేష్‌ పై కూడా సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తన పాదయాత్రలో రాయలసీమను అభివృద్ధి చేస్తామనే హామీలు లోకేష్ ఎలా ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నా.. రాయలసీమకు ఏమీ చెయ్యలేదని దుయ్యబట్టారు. మళ్లీ రాయలసీమను అభివృద్ధి చేస్తామంటే, ప్రజలు నమ్మరని వీర్రాజు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా వీర్రాజు వ్యాఖ్యలు జనసేనలో కొత్త ఆందోళనలు కలిగిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. నిన్నమొన్నటి వరకూ తానే ముఖ్య మంత్రి అభ్యర్థిని అని చెప్పుకు తిరుగుతున్న పవన్… తాజాగా పొత్తులోనే ఎన్నికలకు వెళ్తామని, సీఎం అనే మాట జస్ట్ తన అభిమానుల కోసం చెబుతున్నట్లుగా తెలిపారు.

ఈ సమయంలో చంద్రబాబు వ్యవహారశైలిపైనా, ఆయన నాయకత్వంపైనా సోము వీర్రాజు ఈ స్థాయిలో ఫైరవ్వడంతో.. జనసేనలో ఆందోళనలు నెలకొన్నాయని తెలుస్తుంది. ఒకపక్క బీజేపీతో చంద్రబాబుని కలపడానికి తనవంతు ప్రయత్నాలు తాను చేస్తుండగా… మరోపక్క ఇలా వీర్రాజు మొత్తం వ్యవహారాన్ని చెడగొట్టేస్తున్నారని టెన్షన్ పడుతున్నారంట.

మరి తాజాగా వీర్రాజు వ్యాఖ్యల అనంతరం ఏపీ రాజకీయాల్లో పొత్తుల విషయంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి.