వైసీపీలో మొహం చాటేస్తున్న సిట్టింగులు.!

ఆ చివర నుంచి ఈ చివరదాకా.. అంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వరకూ, చాలామంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదట. పేర్ని నాని రిటైర్మెంట్ సంగతి తెలిసిందే. బొత్స, పెద్దిరెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాంతాడంత వుంది.

కొందరేమో, లోక్ సభ నియోజకవర్గం వైపు చూస్తున్నారు. కొందరేమో రాజ్యసభకు వెళ్తామంటున్నారు. మరికొందరు, ఎమ్మెల్సీ హామీ కోసం ఎదురుచూస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ద్వారా, విజయసాయిరెడ్డి ద్వారా, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ముఖ్యమంత్రికి తమ తమ వినతుల్ని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందిస్తున్నారట.

‘ఈసారికి రిటైర్మెంట్ ఆలోచన వద్దు..’ అంటూ ఇప్పటికే కొందరు సీనియర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. కానీ, సదరు సీనియర్లేమో తాము తప్పుకుని, తమ వారసుల్ని రంగంలోకి దించాలనుకుంటున్నారు.

కొందరేమో, నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత తట్టుకోలేక, వచ్చేసారి పోటీ విషయమై పునరాలోచనలో పడ్డారు. ఇదీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైసీపీలో వున్న పరిస్థితి. ఫలానా నియోజకవర్గంలో ఫలానా ఎమ్మెల్యే ఓడిపోతాడట కదా.. అని వైసీపీ వర్గాల్లోనే చర్చించుకుంటున్నారు.

‘నేనైతే పోటీ చెయ్యను.. నీ పరిస్థితీ బాగాలేదట కదా..’ అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే, ఇంకో వైపీపీ ఎమ్మెల్యేతో చెప్పిన విషయం లీకయ్యింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటివి చాలానే వున్నాయట. రాయలసీమలోనూ కొన్ని చోట్ల ఈ పరిస్థితి వైసీపీలో కనిపిస్తుండడం గమనార్హం.

ఎందుకీ దుస్థితి.? తమ హయాంలోని సంక్షేమంపై వైసీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేకపోతే ఎలా.?