టిఆర్ఎస్ పుట్టా మధు కు మరో షాక్, మహిళా నేత రాజీనామా

గడిచిన నాలుగున్నరేళ్లలో నిత్యం వివాదాల్లో చిక్కుకున్నారు టిఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే పుట్టా మధు. ఆయన అనునిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుతూ మీడియాలోకి ఎక్కారు. ప్రేమ వ్యవహారంలో జరిగిన ఒక హత్య కేసులోనూ పుట్టా మధు మీద ఆరోపణలు వచ్చాయి. బ్రాహ్మణులను తిట్టి వివాదాల్లో నిలిచారు. అధికారులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. కార్యకర్తలను కూడా ఛీదరించుకున్నట్లు విమర్శలున్నాయి.

తాజాగా పుట్టా మధుకు గట్టి షాక్ తగిలింది. టిఆర్ఎస్ పార్టీకి మహిళా నాయకురాలు మంథని జెడ్పీటిసి మూల సరోజన గుడ్ బై చెప్పారు. ఆమె తన రాజీనామా లేఖను పార్టీ నాయకత్వానికి పంపారు. 

మంథని టిఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు తీరు వల్ల జెడ్పీటిసి మూల సరోజన తీవ్ర ఆవేదనకు గురైనట్లు చెప్పారు. తన రాజీనామా సమయంలో ఆమె కంటతడి పెట్టారు. తాజా మాజీ ఎమ్మెల్యే, మంథని టిఆర్ఎస్ అభ్యర్థి పుట్టా మధు వైఖరి కారణంగానే తాను టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినట్లు ఆమె ఏడుస్తూ చెప్పారు. 

పుట్టా మధును గత ఎన్నికల్లో తాము కష్టపడి గెలిపించామని, అయినా ఆయన మా పట్ల వివక్ష చూపుతూ అవమానాలకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. ఇప్పటికే పుట్టా మధు మీద నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఒక మహిళా నాయకురాలు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. 

మరి ఈమె రాజీనామా విషయంలో టిఆర్ఎస్ నాయకత్వం ఏరకమైన వైఖరి తీసుకుంటుందో చూడాలి. మీడియాతో ఆమె ఏమన్నారో కింద వీడియో చూడండి.

trs zptc resignation

 

 

జెడ్పీటిసి మూల సరోజన