అధ్యక్షుడికోసం గుంజాటన పడుతున్న కాంగ్రెస్ అధిష్టానం 

Congress party is disappearing in Telangana
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రులను నియమించడం మూడు నిముషాల్లో పని.  కానీ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించడానికి మూడు నెలలు కూడా సరిపోవని ఒక నానుడి ఉంది.  అధికారంలో  ఉన్నప్పుడు సరే అనుకుందాము.  కానీ, అధికారం లేని చోట, కనీసం సమీప భవిష్యత్తులో వస్తుందనే ఆశలు కూడా లేని రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిని నియమించడానికి నెలరోజులనుంచి కాంగ్రెస్ అధిష్ఠానం పడుతున్న మల్లగుల్లాలు చూస్తుంటే ఆశ్చర్యం  కలిగించక మానదు. 
 
Congress party is disappearing in Telangana 
Congress party is disappearing in Telangana
తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుండటం విచిత్రం.  2014 , 2015  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండంకెల సీట్లు గెలుచుకున్నప్పటికీ గెలిచినవారిలో సగానికి పైగా అధికార టీఆరెస్ పార్టీలో చేరిపోవడవంతో ఆ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి.  ఇక ఇటీవలి కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాక ఆ పార్టీకి ఒక ప్రెసిడెంట్ ను ఎంపిక చెయ్యడానికి అధిష్టానం నానా అవస్థలు పడుతున్నది.  ఆ స్థానం కోసం కనీసం పాతికమందికి పైగా నాయకులు పోటీ పడుతూ ఢిల్లీ ప్రయాణాలు చేస్తున్నారు.  వీరి హంగామా చూస్తుంటే అసలు ఆ పార్టీలో ఏమున్నదబ్బా అనిపిస్తుంది.  
 
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, వి హనుమంతరావు, మల్లు భట్టి విక్రమార్క,  మధు యాష్కీ, జీవన్ రెడ్డి…ఇలా పెక్కుమంది నాయకులు ఆ పదవి మాకు కావాలంటే మాకు కావాలని గర్జిస్తున్నారు.  పార్టీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు హైద్రాబాద్ సందర్శించి నాయకులతో చర్చలు జరిపారు.  అయినప్పటికీ ఏ విషయమూ తేల్చలేకపోతున్నారు.  కొందరు నాయకులైతే అత్యుత్సాహంతో ఢిల్లీ వెళ్లి అధిదేవతలను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించి అక్కడ దర్శనం కూడా దొరక్క, పైగా ఢిల్లీ రావద్దని హెచ్చరికలు, చీవాట్లు తిని ఉసూరుమంటూ ఇంటి ముఖం పడుతున్నారు.  కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరొక దుర్గుణం ఏమిటంటే “నాకు ఇవ్వక పోయినా పర్వాలేదు…వారికి మాత్రం ఇవ్వడానికి వీల్లేదు” అంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు.  “రేవంత్ రెడ్డికి ఇస్తే మేము పార్టీ వీడిపోతాము…మాణికం ఠాకూర్ డబ్బుకు అమ్ముడు పోయాడు” అంటూ వీ హనుమంతరావు తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు.  కోమటిరెడ్డికి ఇవ్వడానికి వీల్లేదని రేవంత్ రెడ్డి, రేవంత్ కు ఇవ్వడానికి వీల్లేదని జగ్గారెడ్డి, జగ్గారెడ్డికి ఇవ్వడానికి వీల్లేదని మరొక నాయకుడు…ఇలా కౌంటర్లు జారీ చేసుకుంటూ పార్టీ పరువును నడిబజారులో నిలబెడుతున్నారు.  
 
కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కావలసింది పార్టీ పట్ల విశ్వాసం, విధేయత ఉన్నవారు కారు.  డబ్బున్న వారు.  తమ సొంతడబ్బుతో పార్టీని నడిపించగల అక్రమార్జనాపరులు.  అందుకే  చాలాకాలంగా పార్టీకి విశ్వాసంగా పనిచేస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు.  ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తమను కాదని నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి చేతికి పగ్గాలు అప్పగిస్తారని అందరి భయం.  ఇప్పటివరకు అధిష్టానం వైఖరి చూస్తుంటే, రేవంత్ రెడ్డికి పీఠం అప్పగించడం ఖాయం అనిపిస్తున్నది.  అదే జరిగితే పార్టీ సీనియర్లు రేవంత్ సారధ్యంలో పనిచేస్తారా లేదా అనేది సందేహం.  ఒకప్పటిలా ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు.  ఎదిరిస్తే తమ మీద కేసులు పెడతారని, వేధిస్తారనే జంకు లేదు.  ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు.  పైగా తెలంగాణాలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తున్నది.  కాంగ్రెస్ పార్టీలో చోటు దొరక్కపోతే చాలామంది బీజేపీలో చేరిపోతారు.  బీజేపీకి కేంద్రంలో అధికారం ఉన్నది.  రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు చేరినా వారు స్వాగతిస్తారు.  కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి, మంత్రి పదవులు అనుభవించిన డి కె అరుణ కు ఇప్పుడు జాతీయస్థాయిలో పదవి దక్కింది.  అలా వారికి  మరొక పార్టీ సిద్ధంగా ఉన్నది.  
 
పార్టీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని నియమిస్తే ఇక కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మిగులుతారో చెప్పడం కష్టమే.  లేదంటే సర్దుకునిపోయినా ఆశ్చర్యం లేదు.  ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుందో ఆరోజే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని ఒక ప్రముఖ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్య అక్షరసత్యం.   
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు