కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది… ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు హీరోలవుతారో? ఎవరెప్పుడు జీరోలవుతారో ఎవరికీ అంతుచిక్కదు. అటువంటి పార్టీలో ఈదుకు రావాలంటే మామూలు విషయం కాదు. కొన్నిసందర్భాల్లో ఎంతగా ప్రయత్నం చేసినా సీటు రాదు.. మరికొన్ని సందర్భాల్లో ఉత్తగ దరఖాస్తు ఇస్తే సీటు ఇచ్చేస్తారు.
తాజాగా మహా కూటమి సీట్ల కేటాయింపు పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో పేరుమోసిన లీడర్లుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గానికి ఊహించని షాక్ తగిలింది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉంది. ఫాలోయింగ్ ఉంది. అందుకోసమే తమ కు పక్కాగా మూడు సీట్లు కావాలని కోమటిరెడ్డి బ్రదర్స్ బలంగా కోరుతూ వచ్చారు.
వారిలో నల్లగొండ సీటుకు కోమటరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు సీటుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని కోరుతూనే నకిరేకల్ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సీటు కావాలని అడిగారు. నకిరేకల్ నియోజకవర్గంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ పుట్టి పెరిగిన ఊరు ఉంటుంది. మహా కూటమి పొత్తుల నేపథ్యంలో కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడైన చిరుమర్తికి టికెట్ గల్లంతయ్యే ప్రమాదం నెలకొంది.
మహా కూటమిలో భాగంగా నకిరేకల్ సీటును చెరుకు సుధాకర్ పార్టీ అయిన తెలంగాణ ఇంటి పార్టీకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. చెరుకు సుధాకర్ సతీమణి చెరుకు లక్ష్మికి ఆ సీటును కేటాయించారు. దీంతో చిరుమర్తి లింగయ్యకు సీటు లేదని తేల్చేశారు. ఈ పరిణామం కోమటరెడ్డి వర్గాన్ని కలవరపాటుకు గురిచేసేదిగా చెబుతున్నారు.
ఒక దశలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉత్తమ్ వర్గం చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్లు వార్తలొచ్చాయి. నకిరేకల్ సీటును చిరుమర్తి లింగయ్యకు కాకుండా డాక్టర్ ప్రసన్నరాజ్ కు ఇస్తారని ప్రచారం సాగింది. ఆయన ఉత్తమ్ ఫాలోయర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరికీ కాకుండా తుదకు మూడో మనిషికి ఆ సీటును కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం.
చిరుమర్తి లింగయ్యకు సీటు రాకపోతే తాను పోటీ కూడా చేయనంటూ ఇటీవల ఒక సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే కోమటిరెడ్డి వర్గంలో మూడు సీట్లకు గాను కోమటిరెడ్డి బ్రదర్స్ కు రెండు సీట్లు ఇచ్చి మూడో సీటుకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సీటునే తెలంగాణ ఇంటి పార్టీకి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
ఇక నల్లగొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయిస్తారని చెబుతున్నారు. వీరిద్దరి సీట్లు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మునుగోడు సీటులో గత నాలుగేళ్ల కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు పాల్వాయి స్రవంతిరెడ్డి. ఆమె మాజీ మంత్రి, మాజీ ఎంపి దివంగత నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె. ఆమె కూడా గట్టిగానే మునుగోడు సీటును అడుగుతున్నారు. కానీ ఆమెను పక్కన పెట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది.
చిరుమర్తి పోటీ చేయడం ఖాయం : కోమటిరెడ్డి
చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ సీటు రావడంలేదని కాంగ్రెస్ లిస్టు లో తేలిపోవండతో నకిరేకల్ కాంగ్రెస్ వర్గాల్లో కలవరం మొదలైంది. కూటమిలో భాగంగా డాక్టర్ చెరుకు సుధాకర్ సతీమణి చెరుకు లక్ష్మికి సీటు ఇవ్వనున్నట్లు తేలడంతో వారంతా కోమటిరెడ్డి సోదరులకు ఫోన్లు చేసి ఆరా తీశారు. అయితే ఈ విషయంలో నకిరేకల్ కాంగ్రెస్ కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. చిరుమర్తి నకిరేకల్ లో పోటీ చేసి తీరుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు కూడా సమాచారం చేరవేశారు.
కోమటిరెడ్డి సోదరుల ఇద్దరికి మాత్రమే సీట్లు ఇస్తామన్న అధిష్టానం నకిరేకల్ చిరుమర్తి లింగయ్యకు కూడా ఇచ్చి ఉంటే బాగుందేదని అంటున్నారు నకిరేకల్ కాంగ్రెస్ వర్గాలు.