అమిత్ షా‌తో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ.! ఇదేం రాజకీయం.?

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ఇద్దరూ తాజాగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా‌తో భేటీ అయ్యారు. కొద్ది సమయం తేడాతో ఇద్దరు అన్నదమ్ములూ, బీజేపీ సీనియర్ నేతతో భేటీ అవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

తాను కరడుగట్టిన కాంగ్రెస్ వాదిననీ, కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని చెబుతూ వస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా నినదిస్తున్న వేళ.. అనూహ్యంగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో భేటీ అవడం కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఓ ఎంపీగా, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసమే కేంద్ర మంత్రిని కలిశాను తప్ప, ఇందులో బీజేపీతో తనకు లింకు కట్టే అంశమేదీ లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.

మరోపక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక కోసం సిద్ధమవుతున్నారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా మునుగోడుకి ఉప ఎన్నిక తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

అటు వెంకటరెడ్డి, ఇటు రాజగోపాల్ రెడ్డి.. ఇద్దరూ ఢిల్లీలో రాజకీయం చేస్తోంటే, కోమటిరెడ్డి బ్రదర్స్‌కి మంచి పట్టున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలంతా మోహరించారు. మునుగోడు ఉప ఎన్నికపై సన్నాహక సమావేశాల్లో బిజీగా వున్నారు.

తొలుత రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే, ఆ తర్వాత తాను కూడా బీజేపీలోకి వెళ్ళాలనే ఆలోచనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వుంటూనే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న వెంకటరెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా అసహనంతో వున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత అమిత్ షా‌తో వెంకటరెడ్డి భేటీ అవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయ్యింది.