కోమటిరెడ్డి బ్రదర్స్ బాటలో ఎర్రబెల్లి బ్రదర్స్.!

Errabelli

నల్గొండ జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ఇద్దరిదీ ఎప్పుడూ ఒకే మాట. ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ ఫాలోవర్స్ తప్ప, ప్రత్యేకంగా వెంకటరెడ్డి అభిమానులు, రాజగోపాల్ రెడ్డి అభిమానులు అని వుండరు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు, బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వెంకటరెడ్డి తాను నిఖార్సయిన కాంగ్రెస్ వాదినని అంటున్నారు.

ఈ రచ్చ ఇలా జరుగుతుండగా, తెలంగాణలో మరో బ్రదర్స్ మధ్య చీలిక వచ్చింది. ఈసారి వ్యవహారం ఓవర్ టు వరంగల్ జిల్లా. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని వీడుతున్నట్లు ప్రకటించారు. దాంతో, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్.. అటు ఎర్రబెల్లి బ్రదర్స్.. తెలంగాణలో సరికొత్త రాజకీయం.. అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

ఎర్రబెల్లి దయాకర్ రావు, తన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ద్వారా చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేస్తుంటారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు, ఆ పార్టీ వైపు ప్రదీప్ రావుని పంపించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇలా వుంటుంది ఆయన రాజకీయం. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంతో పోల్చితే, ఎర్రబెల్లి బ్రదర్స్ రాజకీయం.. చాలా ప్రత్యేకం.

ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలోకి వెళుతున్నారంటే, ఆయన బాటలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా త్వరలో బీజేపీలోకి వెళతారన్న చర్చ ఎర్రబెల్లి అభిమానుల్లో జరుగుతోంది. తన సోదరుడి విషయమై ఇంతవరకు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించలేదు. పార్టీకి నష్టం జరుగుతుంది గనుక, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈపాటికే స్పందించి వుండాల్సింది ఎర్రబెల్లి ప్రదీప్ రావు విషయమై.

కాగా, ఇదంతా బీజేపీ మార్కు రాజకీయమనీ, అత్యంత వ్యూహాత్మకంగా కుటుంబాల మధ్య బీజేపీ చిచ్చు రేపుతోందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తోంది. రాజకీయాలంటేనే అంత.! తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ బావుంటుందన్న కోణంలోనే రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు. అంతే తప్ప, సిద్ధాంతాలనేవి వుండవ్ ఇక్కడ.