కూటమికి హరీష్ షాక్ ఇస్తే, టిఆర్ఎస్ కు బిజెపి షాక్

రాజకీయాల్లో ఎత్తులు వేయడం ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం సహజం. ఎవరి ఎత్తులు చిత్తవుతాయో అన్నది కాలం, జనాలు నిర్ణయిస్తారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ఇప్పుడు ముందంజలో ఉంది. ఇక టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు సంపాదించిన హరీష్ రావు రంగంలోకి దిగితే అవతలి పార్టీ దుకాణం మూయాల్సిందే అన్న ప్రచారం కూడా ఆయన మీద ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ ఇప్పటి వరకు హరీష్ రావు చేసిన ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. ప్రత్యర్థి పార్టీలు చిత్తయ్యాయి. కానీ మెదక్ జిల్లా దుబ్బాకలో హరీష్ రావు ప్రత్యర్థి కూటమికి షాక్ ఇచ్చిన 24 గంటల్లోనే ఆయన పార్టీకి బిజెపి షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు చదవండి.

కేంద్ర మంత్రి జెపి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరిన టిఆర్ఎస్ జెడ్పీటిసిలు

మెదక్ జిల్లాలో ఇద్దరు మహిళా జెడ్పీటిసిలు టిఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గానికి చెందిన దుబ్బాక మండల జెడ్పీటిసి ఏల్పుల గౌతమీ మహేష్, తొగుట మండల జెడ్పీటిసి కే.రూపాపరిపూర్ణాచారి ఇద్దరూ టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. వీరే కాకుండా సుమారు 200 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బిజెపి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా హైదరాబాద్ వచ్చి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కమల తీర్థం పుచ్చుకున్నారు. వీరే కాకుండా మరింత మంది దుబ్బాక టిఆర్ఎస్ నేతలు కమలం పార్టీ గూటికి చేరనున్నట్లు బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు మీడియాకు తెలిపారు.

చెరుకు ముత్యం రెడ్డితో హరీష్, సోలిపేట భేటీ

ఎన్నికల వేళ దుబ్బాకలో ఇద్దరు టిఆర్ఎస్ జెడ్పీటిసిలు  టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశమైంది. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి పట్ల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో ఈ సీటులో కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డికి టికెట్ రావొచ్చని చర్చ జరిగింది. కానీ ఆ సీటును కూటమిలో భాగంగా జన సమితి తీసుకున్నది. జన సమితి తరుపున చిందం రాజ్ కుమార్ పోటీలో ఉన్నారు. ఆయన ఇప్పటికే తన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

దుబ్బాక సీటు జన సమితికి కేటాయించారని, కాంగ్రెస్ కు సీటు లేదని తెలియగానే జిల్లా మంత్రి హరీష్ రావు చక్రం తిప్పారు. ఆయన దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డిని వెంటబెట్టుకుని నేరుగా చెరుకు ముత్యంరెడ్డి ఇంటికి వెళ్లిపోయారు. హరీష్ రావును చూడగానే చెరుకు ముత్యంరెడ్డి కంటతడి పెట్టారు. వెంటనే టిఆర్ఎస్ లో చేరాలంటూ హరీష్ రావు చెరుకు ముత్యంరెడ్డిని ఆహ్వానించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కేసిఆర్ సమక్షంలో ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరవచ్చని చెబుతున్నారు. 

బిజెపి ఫైర్ బ్రాండ్, దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు

ఇక హరీష్ రాజకీయం హరీష్ చేస్తే బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు తన రాజకీయం మొదలు పెట్టారు. హరీష్ రావు కూటమికి షాక్ ఇచ్చిన 24 గంటల్లోనే టిఆర్ఎస్ కు రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. ఇద్దరు టిఆర్ఎస్ మహిళా జెడ్పీటిసిలను బిజెపిలో చేర్పించారు. దీంతో చెరుకు ముత్యంరెడ్డి పార్టీలోకి వచ్చిండని సంబరపడే వేళ టిఆర్ఎస్ పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. రఘునందన్ రావు చతురతతో దుబ్బాక పోరును కూటమి వర్సెస్ టిఆర్ఎస్ గా లేకుండా ట్రై యాంగిల్ ఫైట్ గా మార్చేశారని అంటున్నారు. 

దుబ్బాక కూటమి (టిజెఎస్) అభ్యర్థి చిందం రాజ్ కుమార్