ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేయాలనుకున్న మూడు రాజధానుల విషయంలో రోజుకో మలుపు చోటు చేసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం కోర్టు మూడు రాజధానుల విషయంలో ఎలాంటి తీర్పునిస్తుందో అని ఉత్కంఠ నెలకొంది. అయితే ఇదే సమయంలో సుప్రీం కోర్టులో కూడా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.
సాధారణంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తీర్పు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరే రాష్ట్రం అమలు చేయని మూడు రాజధానుల విధానాన్ని జగన్ సర్కార్ అమలు చేస్తామని చెబితే సుప్రీం కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పలేం. సుప్రీం కోర్టులో కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే జగన్ సర్కార్ పరువు పోతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే హక్కు ఉంటుంది. అయితే ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ పోతే నష్టపోయేది ప్రజలేననే సంగతి తెలిసిందే. జగన్ మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఏపీ ప్రజలే తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి కూడా జగన్ కు మద్దతు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీకి అనుకూల ఫలితాలు కూడా రావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి భూములు కొనుగోలు చేసిన వాళ్లు లాభపడతారనే ఒకే ఒక్క ఆలోచనతో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలులోకి తెచ్చిందని చాలామందిలో అభిప్రాయం ఉంది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసినంత మాత్రాన కర్నూలుకు పెద్దగా బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉండదు. సుప్రీం కోర్టు నుంచి జగన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందో వ్యతిరేకంగా తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది.