ఎమ్మెల్యే కిడారి గురించి బయటకు వస్తున్న షాకింగ్ నిజాలు

మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ ఆదివారం మృతి చెందారు. అరకులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కిడారి, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేని కాల్చి చంపడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. ఈ ఘటనతో ఎమ్మెల్యే కిడారికి సంబంధించిన కొన్న షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలు కింద పూర్తిగా ఉన్నాయి చదవండి.

కిడారి తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనుచరుడిగా ఉన్నారు. మంత్రి కొణతాల ఆశీస్సులతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ను విడిచి వైసిపిలో చేరారు. అరకు నియోజక వర్గం నుండి 2014 ఎలెక్షన్లలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలే వైసిపిని విడిచి టిడిపిలో చేరారు.

కిడారి ప్రతిపక్ష పార్టీ వైసిపిలో ఉన్నప్పుడే కొంతమంది బడా వ్యాపారులతో నల్లక్వారీలు నడపడంలో దిట్ట అయ్యారని తెలుస్తోంది. ఆయన బావ పేరు మీద హుకుంపేటలోని “గూడ” క్వారీ ఉంది. సుమారు ఆరేడు గ్రామాల ప్రజలు ఈ క్వారీ వలన తమకు నష్టం జరుగుతుందంటూ ఆందోళన చేస్తున్నారు. ఇటీవల ఈ గ్రామాలలో పర్యటించిన జనసేన అధినేత గ్రామస్థులకు తన మద్దతు ప్రకటించారు. ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ట్రాన్స్ఫర్ అవడం వలన సబ్ కలెక్టర్ దీనిపై విచారణ జరపాల్సి ఉంది. కానీ అది పూర్తి అవలేదు.

ఇంతలోనే ఆందోళనకు దిగిన గ్రామస్థుల టెంటులను రాత్రికి రాత్రే తగలబెట్టేశారు. ఇది కిడారి పనే అని గ్రామస్థులు నిర్ధారణకు వచ్చారు. వారి ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో క్వారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే మావోయిస్టులు మైనింగ్, భూకుంభకోణాలు, అక్రమ వ్యవహారాల విషయంలో చాలాసార్లు సర్వేశ్వరరావుని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయినా వారి మాటలను పెడచెవిన పెట్టడంతో కిడారిని కాల్చి చంపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. పైగా అధికార పార్టీలో ఉన్నాం, ఎవరు ఏమి చేయరులే అనే గర్వంతో తనపై వచ్చిన ఆరోపణలు కిడారి సరిదిద్దుకోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.