పోయిన నెల 23వ తేదన మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఫిరాయింపు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు ఘటనలో స్ధానిక టిడిపి నేత హస్తముందన్న విషయం ఇపుడు సంచలనం కలిగిస్తోంది. వారం రోజులుగా కిడారి హత్యపై పోలీసులు ప్రిస్టేజ్ గా తీసుకున్న విషయం తెలిసిందే. అందుకనే హత్యకు సంబంధించిన దర్యాప్తును చాలా వేగంగా చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కిడారి హత్యకు సొంత పార్టీ నేతే కారణమన్న విషయం తెలిసి నివ్వెరపోయారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, తన నియోజకవర్గమై అరకులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమ తిరిగి వస్తున్నపుడు మావోయిస్టులు వారి వాహనాన్ని నిలిపి బయటకు తీసుకొచ్చి కాల్చి చంపేసిన విషయం సంచలనం కలిగించింది. అప్పటి నుండి పోలీసులు ఈ కేసు దర్యాప్తును ఓ చాలెంజ్ గా తీసుకున్నారు. ఎంఎల్ఏకి బాగా దగ్గరగా ఉండే కొందరిని విచారించినపుడు కొన్ని విషయాలు తెలిశాయట.
వారు చెప్పిన వివరాల ప్రకారం పలువురి సెల్ ఫోన్ల కాల్ డేటాను తెప్పించారు. కాల్ డేటాను చూసిన పోలీసు ఉన్నతాధికారులకు మతిపోయిందట. అందులో ఒకరి కాల్ డేటా అనుమానంగా ఉండటంతో మరింత లోతుగా దర్యాప్తు చేసినపుడు చాలా విషయాలు బయటకు వచ్చాయట. అరకు నియోజకవర్గానికే చెందిన ఓ ఎంపిటిసి మావోయిస్టులతో చాలా సార్లు మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. అదే విషయాన్ని ఆ ఎంపిటిసిని అదుపులోకి తీసుకుని విచారించినపుడు అన్నీ విషయాలను అంగీకరించినట్లు సమాచారం.
పోయిన నెల 19వ తేదీనే ఎంఎల్ఏ హత్యకు నిర్ణయించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ ఎంపిటిసినే ఎంఎల్ఏని ఒప్పించారట. ఎంఎల్ఏ ఓకే చెప్పగానే అదే విషయాన్ని ఎంపిటిసి మావోయిస్టులకు చేరవేశారు. దానికి తగ్గట్లుగానే మావోయిస్టులు అంతా రెడీ చేసుకున్నారు. అయితే, తన భార్యకు అనారోగ్యంగా ఉంది ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటూ ఎంఎల్ఏ చివరి నిముషంలో ప్రోగ్రామ్ ను రద్దు చేసుకున్నారు.
19వ తేదీన రద్దు చేసుకున్న కార్యక్రమాన్ని 23వ తేదీకి వాయిదా వేసుకున్న ఎంఎల్ఏ అన్నమాట ప్రకారం ఆదివారం వచ్చారు. తాను వస్తున్న సమాచారాన్ని ఎంపిటిసికి ముందు రోజే చెప్పారట. ఎంఎల్ఏ నుండి సమాచారం అందగానే అదే విషయాన్ని ఎంపిటిసి మావోయిస్టులకు చేరవేశారట. వెంటనే మావోయిస్టులు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని లిపిటిపుట్టు గ్రామానికి చేరుకున్నారు. మరుసటి రోజు కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఎంఎల్ఏని, మాజీ ఎంఎల్ఏని అడ్డుకుని హత్య చేశారు. ఎంఎల్ఏ హత్యలో మావోయిస్టులకు తమ పార్టీ ఎంపిటిసినే సహకరించారన్న విషయం బయటకు రావటంతో టిడిపి నేతలకు ఏం చేయాలో దిక్కుతోచటం లేదు.
మరొక హాట్ న్యూస్