ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో తెలుగుదేశంపార్టీకి ఊహించని విధంగా పెద్ద దెబ్బే పడింది. ఫిరాయింపు ఎంఎల్ఏనే అయినప్పటికీ టిడిపిలో బాగా యాక్టివ్ గా పనిచేస్తున్న కిడారి సర్వేశ్వరరావును హఠాత్తుగా మావోయిస్టులు మట్టుపెట్టారు. ఎంఎల్ఏతో పాటు మాజీ ఎంఎల్ఏ సివేరి సోమను కూడా మావోయిస్టులు చంపేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ఈ ఇద్దరినీ మావోయిస్టులు కారులో నుండి దింపి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడి మరీ తుపాకులతో కాల్చి చంపేయటం పెద్ద సంచలనం రేపుతోంది.
టిడిపి తరపున ఒక్కళ్ళూ గెలవలేదు
ఎంఎల్ఏ, మాజీ ఎంఎఎల్ఏల హత్యతో తెలుగుదేశంపార్టీ ప్రజా ప్రతినిధులు, నేతల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది. పోయిన ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంతంలో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు ఎంపి నియోజకవర్గంలో కూడా టిడిపి అభ్యర్ధులు ఓడిపోయారు. దానివల్ల టిడిపి ఏజెన్సీ ఏరియాలో నిర్వహించే కార్యక్రమాల్లో టిడిపి బాగా తేలిపోతోంది. దాని ప్రభావం పార్టీపైనే కాకుండా చంద్రబాబునాయుడుపైన కూడా పడిందన్నది వాస్తవం.
అందుకే ఫిరాయింపుల వల
ఆ ఇబ్బందుల్లో నుండి బయటకు రావటానికే టిడిపి ఎంఎల్ఏలపైన చంద్రబాబు ఫిరాయింపుల వల విసిరారు. ముందుగా అరకు ఎంపి కొత్తపల్లి గీత తర్వాత సర్వేశ్వరరావు చివరగా గిడ్డి ఈశ్వరి వలలో చిక్కుక్కున్నారు. సరే గీత పరిస్ధితేంటో అందరూ చూస్తున్నదే. చివరగా చేరిన గిడ్డి పరిస్ధితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క సర్వేశ్వరరావు మాత్రమే విప్ పదవిని దక్కించుకోగలిగారు.
కిడారిపై ఆరోపణలు
ఆర్ధికంగా కూడా కిడారి బలపడుతున్నాడనే ఆరోపణలు బలపడుతుండగానే మావోయిస్టుల తూటాలకు బలైపోయాడు. దాని దెబ్బకు టిడిపి ప్రజా ప్రతినిధుల్లోనే కాకుండా నేతలపైనే ఆ ప్రభావం చూపటం ఖాయం. ఎలాగంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్న టిడిపి నేతల్లో అత్యధికులు ఆదివారం సాయంత్రమే ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలేసి మైదాన ప్రాంతాలకు వచ్చేశారు. బహుశా ఇపుడిపుడే తిరిగి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళే సాహసం కూడా చేయలేకపోవచ్చు.
రేపటి పరిస్ధితేంటి ?
ఈ పరిస్ధితి వచ్చే ఎన్నికలపై పడుతుందనటంలో సందేహం లేదు. కిడారి టిడిపిలోకి ఫిరాయించకుండా వైసిపిలోనే ఉండుంటే మావోయిస్టుల టార్గెట్ కు బలయ్యేవాడు కాదనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఫిరాయింపులపై బలంగా పనిచేస్తుందనటం వాస్తవం. ఇటువంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసేదెవరు ? స్వేచ్చగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందా ? అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, మావోయిస్టుల టార్గెట్లో ఇంకెతమంది టిడిపి నేతలున్నారో తెలీదు. టార్గెట్లో ఇంకా ఉండుంటే మాత్రం తెలుగుదేశంపార్టీకి ఇది ఊహించని దెబ్బ అనే చెప్పాలి.