ఏపీ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో కాకరేపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అనుచరుల మధ్య పోరు భీకరంగా సాగుతోంది. వీలయినన్ని ఏకగ్రీవ పంచాయతీలను చేయాలని వైసీపీ, అత్యధిక గ్రామాలను చేజిక్కించుకుని అధికార పార్టీకి సవాల్ విసరాలని టీడీపీ పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే నియోజకవర్గం పరిధిలోని దుగ్గిరాల మండలంలో వైసీపీకి షాక్ తగిలింది.
ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు వైసీపీ నుంచి ప్రతిపక్ష టీడీపీలోకి జంప్ అయ్యారు. అసలేం జరిగిందంటే. సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం ఉండే నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం కంఠం రాజు కొండూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో వైసీపీలోనే వర్గ విబేధాలు వచ్చాయి. దీంతో తనకు అన్యాయం జరిగిందని భావించిన దళిత నాయకుడు సుద్దపల్లి రమేష్ టీడీపీలోకి జంప్ అయ్యారు. మండలస్థాయి నాయకుడు కావడంతో ఆయనకు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పట్టు ఉంది.
దుగ్గిరాల మండల టీడీపీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు నందం అబద్దయ్య సమక్షంలో అనుచరులతో కలిసి సుద్దపల్లి రమేష్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరిన వెంటనే సుద్దపల్లి రేమేష్ ను కంఠం రాజు కొండూరు గ్రామ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటించారు. మొత్తానికి సీఎం జగన్ నివాసం ఉండే నియోజకవర్గంలో అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష టీడీపీలోకి ఓ నాయకుడు పార్టీ మారడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.