బోరు  కొడుతున్న షర్మిల ప్రసంగాలు..స్టైల్ మార్చాలి

ఎన్నికల ప్రచారంలో నేతలు హోరెత్తించేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. తెలుగుదేశంపార్టీలో చంద్రబాబునాయుడు ఒంటరి పోరాటంచేస్తున్నారు. అదే సమయంలోజగన్మోహన్ రెడ్డి ప్రచార భారాన్ని పంచుకోవటానికి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా మద్దతుగా నిలబడ్డారు. తల్లి, చెల్లి రోజుకు నాలుగైదు  నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

విజయమ్మ రోడ్డుషోలకైనా షర్మిల రోడ్డు షోలకైనా జనాలైతే బాగానే వస్తున్నారు. కానీ షర్మిల ప్రసంగాలు మాత్రం బోరు కొట్టేస్తున్నాయి.  ఏ రోడ్డుషో తీసుకున్నా లేకపోతే ఎక్కడ మాట్లాడినా అరిగిపోయిన రికార్డులాగే ఉంటోంది.  చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని షర్మిల ఓ నాలుగైదు పాయింట్లనే తిప్పి తిప్పి మాట్లాడుతున్నారు. బైబై బాబని, డ్వాక్రా మహిళలను మోసం చేశాడని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, సింహం ఒంటిరిగానే వస్తుందని, నక్కలే గుంపుగా వస్తాయనే రొడ్డ కొట్టుడు స్పీచులనే షర్మిల దంచుతున్నారు.

ఇవికాకపోతే పప్పుగారని, అఆలు రాకపోయినా అగ్రతాంబూలం మాత్రం తనకే కావాలన్నాడట, అమ్మకు అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట లాంటి సామెతలను పదే పదే వాడుతున్నారు.  ఒకపుడంటే ఒక సభలో మాట్లాడేది మరో సభలో మాట్లాడే వరకూ తెలిసేది కాదు. కానీ ఇంటర్నెట్ యుగంలో అన్నీ సభలను లైవ్ వచ్చేస్తున్నాయి టివిల్లో. కాబట్టి ఒకటి రెండు సభల్లో మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడితే వినేవాళ్ళకు విసుగొచ్చేస్తుంది. షర్మిల రోడ్డు షోల్లో జరుగుతున్నదదే.

చంద్రబాబు, లోకేష్ ని ఎక్కువగా టార్గెట్ చేసే బదులు నియోజకవర్గంలో పర్యటించేటపుడు అపరిష్కృతంగా ఉన్న స్ధానిక సమస్యలను ప్రస్తావించవచ్చు. టిడిపి అభ్యర్ధుల అవినీతిని ప్రశ్నించవచ్చు. వైసిపి అభ్యర్ధుల్లోని ప్లస్ పాయింట్లు చెప్పవచ్చు. అదే సమయంలో స్ధానకంగా ఉండే తటస్తులుగా ఉండే వ్యక్తుల గురించి కూడా నాలుగు మంచి మాటలు చెబితే వాళ్ళు  కూడా వైసిపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. జనాలను ఆకర్షించటానికి ఇన్ని అవకాశాలను వదులుకుని అరిగిపోయిన రికార్డులాగ చెప్పిందే చెబుతుంటే ఎవరికి మాత్రం ఆసక్తుంటుంది ?