షర్మిల రాజకీయం.! వైఎస్ జగన్‌కి సంబంధం లేదా.?

‘మేం చెబితే షర్మిల వినలేదు..’ అని గతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ షర్మిల తెలంగాన రాజకీయంపై ఘాటైన కామెంట్స్ చేశారు. వైఎస్ షర్మిల గనుక జగన్ మాట విని వుంటే, ఆమెకు తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. బోల్డంత ఖర్చు దండగయ్యింది. పైగా, వైఎస్ విజయమ్మ అకారణంగా, వైసీపీని వీడాల్సి వచ్చింది.

తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేసి, తన తండ్రి మరణం వెనుక కుట్ర వుందనీ వాపోయి.. షర్మిల పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇవన్నీ వృధా అయిపోయాయి. అరెస్టులు, దారుణమైన విమర్శలు.. షర్మిల చాలానే చూసేశారు. ఇంత కష్టపడి ఇప్పుడేమో, పార్టీని నడపలేక, కాంగ్రెస్ పార్టీ పంచన చేరేందుకు ప్రయత్నిస్తుండడం బాధాకరమే.

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో షర్మిలని పక్కదారి పట్టించిందే వైఎస్ జగన్ అన్న ఆరోపణలు లేకపోలేదు. అదే సమయంలో, షర్మిలని కాంగ్రెస్ పార్టీ వైపు నడిపిస్తున్నది కూడా వైఎస్ జగన్.. అన్న ఆరోపణలూ వున్నాయి. రెండిటిలో ఏదో ఒకటి నిజం అనుకోవాలా.? రెండూ అబద్ధమేనని భావించాలా.?

వెనక్కి తిరిగి చూసుకుంటే, తాను రాజకీయాల్లోకి వచ్చి సాధించింది ఏమీ లేదన్న విషయం వైఎస్ షర్మిలకు అర్థమవుతుంది. అన్న మెప్పు పొంది, ఏ రాజ్యసభకో వైఎస్ షర్మిల వెళ్ళగలిగి వుంటే బావుండేది. కాస్త ఓపిక పడితే, వచ్చే ఎన్నికల్లో ఆమె లోక్ సభకు పోటీ చేసే అవకాశం వైసీపీ నుంచి దక్కించుకునేవారేమో.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. వైఎస్ షర్మిల, తన అన్న వైఎస్ జగన్ సాయం కోరడం మంచిది. లేకపోతే, కాంగ్రెస్ పార్టీ వాడకం ఎలా వుంటుందో ఆమె ముందు ముందు ఇంకోసారి చూడాల్సి వస్తుంది. అప్పుడిక వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల అనే స్థాయికి రాజకీయం మారిపోతుంది.

కాగా, షర్మిల వ్యవహారాలపై వైఎస్ జగన్ నిఘా పెట్టారనీ, ఆమెను వారిస్తూనే వున్నారనీ.. వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.