వైఎస్ జగన్ పాత ట్వీటుపై నాగబాబు సెటైర్.!

Nagababu

ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, అధికారంలోకి వచ్చాక అవే పరిస్థితుల్ని సామాన్యులకు కల్పిస్తున్నారంటూ జనసేన కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబు ఆరోపించారు. ఆరోపించడమే కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన ట్వీట్‌ని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.

చంద్రబాబు హయాంలో అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురిచేస్తున్నట్లు అప్పట్లో, అంటే 2017 మే 17న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీటేశారు.

‘మీ పాలన సిగ్గు చేటు..’ అంటూ జగన్ మోహన్ రెడ్డి మండి పడ్డారు ఆ ట్వీటులో. ‘సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు అక్రమం, అన్యాయం..’ అంటూ నినదించారు వైఎస్ జగన్.

ఆనాటి ఆ ట్వీటుని నాగబాబు ఇప్పుడు పోస్ట్ చేస్తూ, ‘ముఖ్యమంత్రిగారూ నిద్ర లేవండి.. ఇప్పటికైనా ఈ అక్రమ అరెస్టులు ఆపండి..’ అంటూ నాగబాబు ట్వీటేశారు. మహాసేన రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంపై నాగబాబు ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.

గత కొద్ది కాలంగా మహాసేన పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు మహాసేన రాజేష్. నిజానికి, వైసీపీ హయాంలో చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదయ్యాయి. రాత్రికి రాత్రి పోలీసులు, ఆయా వ్యక్తుల ఇళ్ళలోకి చొరబడి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాల నుంచి పోలీసు వ్యవస్థ చీవాట్లనూ ఎదుర్కోవాల్సి వస్తోంది.