నిన్నమొన్నటివరకూ ఏపీ సీఐడీ చీఫ్ గా ఉండి అనంతరం ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సీనియర్ ఐపీఎస్ అధికారి, పీవీ సునీల్ కుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటులపైనా, ఇండస్ట్రీపైనా పరోక్షంగా సెటైర్స్ వేశారని తెలుస్తోంది. ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది ఒక తమిళ సినిమాను ప్రశంసించే విషయంలో కావడం గమనార్హం.
అవును… ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన తమిళ సినిమా.. “మామన్నన్”. “నాయకుడు” పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ సినిమాలో సీనియర్ కమేడియన్ వడివేలు.. తొలిసారిగా సీరియస్ క్యారెక్టర్ లో కనిపించారు. కాశీపురం శాసన సభ్యుడిగా, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ గా ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో దళితుల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు!
దీంతో ఈ సినిమా దళిత వర్గాలనుంచి, మేధావుల నుంచి, మరికొంతమంది సంస్కారలనుంచి ప్రశంసలను అందుకుంటోంది! ఈ క్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. “మామన్నన్” సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొంటూ… తెలుగు సినిమా పరిశ్రమతో ఈ సినిమా గొప్పదనాన్ని కంపేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ రాశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.
“నెట్ ఫ్లిక్స్ లో ఉన్న “మామన్నన్” సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో దళితుల ఆత్మగౌరవ ప్రశ్నను ఎన్ని తెలుగు సినిమాలు చూపించాయి? జనాభాలో నూటికి ఇరవై మంది దళితులు ఉంటే వందకోట్లు వసూలు చేసిన సినిమాకు వాళ్ళిచ్చిన చందా ఇరవై కోట్లు. వంద కోట్ల పైన వసూళ్ళు వచ్చిన సినిమాల్లో ఏ దళిత ప్రశ్న ఉందని అన్ని కోట్లు కుమ్మరించారు?”
“తమ తాతల, వంశాల గొప్పలు గ్లోరిఫికేషన్, రాజుల కథలు, హీరోయిన్ ఇంకా మరికొందరి “అందాంద”ప్రదర్శన … ఇవి తప్ప ఏమీ లేవా దళితులు చూడ్డానికి? మన జీవితాలు, మన సమస్యలు, మన ఎమోషన్స్ కూడా అంటరానివే తెలుగు సినిమాకి! ఎందుకు ఇంకా ఆ జీరోలని, వాళ్ళ ఫ్లెక్సీలని మన వాడల దాకా రానిస్తారు?”
“మామన్నన్, ఒన్నియన్ పెరుమాళ్ చూసి మనం చూసే సినిమాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. సినిమాటిక్ కోణంలో చూసినా వీళ్ళు జీరోలే.. “మా మన్నన్ లో హీరో పెంచే పందులు … ఫహాద్ ఫాజిల్ పెంచే కుక్కలూ చాలా చక్కగా నటించాయి. పై రెండు వాక్యాలూ విడిగా చదువుకోండి” అని సంచలనాత్మక ట్వీట్ చేశారు సునీల్ కుమార్ ఐపీఎస్!
దీంతో ఈ ట్విట్ట్ ఇండస్ట్రీలో ఉన్న జీరోలకు (సునీల్ కుమార్ దృష్టిలో) ఎక్కడ దిగిందన్న సంగతి కాసేపు పక్కనపెడితే… దళితులు మాత్రం పునారోలించుకోవాల్సిన అవసరాన్ని ఏర్పాటు చేసిందని అంటున్నారు పరిశీలకులు!
