డిఎల్ గౌరవం కోరుకుంటున్నారహో…

నిజంగానే సీనియర్ నేత అదే కోరుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తనకు కాస్త గౌరవం కావాలని కోరుకుంటున్నారు. నిజంగా డిఎల్ పరిస్ధితి చూస్తుంటే జాలేస్తోంది. తనకు గౌరవం ఇవ్వాలని డిఎల్ కోరుకుంటున్నారంటే ఇఫుడెవరూ తనకు గౌరవం ఇవ్వటం లేదనే కదా ? నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేతను ఏ పార్టీ కూడా ఎందుకు గౌరవంగా చూడటం లేదు ? పార్టీలు సదరు నేతను సరిగా అర్ధం చేసుకోలేదా ? లేకపోతే ఆ నేతకు అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాయా ?

ఏదేమైనా డిఎల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డిని, మైదుకూరులో రఘు రామిరెడ్డే పోటీ చేస్తారని జగన్ స్పష్టం చేశారు. అయితే అక్కడే ఉన్న డిఎల్ మద్దతుదారులు జగన్ తో మాట్లాడుతూ, మైదుకూరులో డిఎల్ కే టిక్కెట్టు కావాలంటూ డిమాండ్ చేశారు.

ఆ విషయమై జగన్ మాట్లాడుతూ, మైదుకూరులో సిట్టింగ్ ఎంఎల్ఏ గెలుపుకు సహకరించాలని, వైసిపి అధికారంలోకి రాగానే డిఎల్ కు ఎంఎల్సీ పదవి ఇస్తానని బహిరంగంగానే హామీ ఇచ్చారు. దానిపై డిఎల్ మండిపోయారు. తనను గౌరవంగా పార్టీలోకి ఆహ్వానించి టిక్కెట్టిస్తే పోటీ చేస్తానంటూ చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, 6 సార్లు గెలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి తనకు ఎవరో ఎంఎల్సీ పదవి ఇస్తే తీసుకునే స్ధితిలో తాను లేనంటూ చెప్పటం విచిత్రంగా ఉంది. ఏ పార్టీ తనను గౌరవంగా చూసుకుంటానంటే ఆ పార్టీలోకే వెళతానని అడ్డుకోవటం విడ్డూరంగా లేదూ ? తనను అందరూ గౌరవించాలని డిఎల్ కోరుకోవటం ఏంటి ? డిఎల్ ను గౌరవించాలని ఎవరికి వారుగా అనుకోవాలి గానీ ?