టిడిపిలో 2019 టెన్షన్..తలపట్టుకున్న చంద్రబాబు

ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ తెలుగుదేశంపార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందట. ఇటు పార్లమెంటు, అటు అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరుగుతుండటంతో చాలామంది సీనియర్లు పోటీకి వెనకాడుతున్నారట. స్వయంగా చంద్రబాబునాయుడే పిలిచి అడిగినా పార్లమెంటుకు పోటీ చేయటానికి ఇష్టపడటం లేదంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్దితి ఒక్క ప్రాంతంలో అని కాదు. 25 లోక్ సభ స్ధానాల్లో దాదాపు 20 స్దానాల్లో ఒకే పరిస్ధితి కనబడుతోందట. అందుకే పార్లమెంటుకు గట్టి అభ్యర్ధులను రంగంలోకి దింపటం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైందని సమాచారం. నాలుగున్నరేళ్ళుగా మంత్రులుగా ఉన్న నేతలు కూడా ఎంపిలుగా పోటీ చేయటానికి వెనకాడుతుండటమే విచిత్రంగా ఉంది.

 

రాబోయే  ఎన్నికల్లో ప్రత్యేకహోదా, నిరుద్యోగం, అవినీతి ప్రధాన అంశాలవుతాయని ప్రముఖ మీడియా సంస్ధలు నిర్వహించిన వివిధ సర్వేల్లో జనాలు అభిప్రాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఇండియా టుడే, ఆజ్ తక్, రిపబ్లిక్ టివి లాంటి మీడియా సంస్ధలు ఏపికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపబోయే అంశాలపై సర్వే చేసిన విషయం తెలిసిందే.  ప్రత్యేకహోదా, అవినీతి, నిరుద్యోగమే ప్రధాన అంశాలుగా జనాలు అభిప్రాయపడ్డారు. పై అంశాల ప్రాతిపదికగానే జనాలు నిజంగా ఓట్లేస్తే టిడిపి పరిస్ధితి అంతే సంగతులు.

 

ఆ విషయాలు టిడిపి ఎంపిలతో పాటు సీనియర్ ఎంఎల్ఏలకు బాగా అర్ధమైనట్లుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎంపిలుగా పోటీ చేయటానికి వెనకాడుతున్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకూ దాదాపు ఇదే పరిస్ధితి కనబడుతోందట. వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానంటూ శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు చంద్రబాబుతో చెప్పారట. రామ్మోహన్ స్ధానంలో మంత్రి అచ్చెన్నను పోటీ చేయమంటే కుదరదన్నారట. విజయనగరం ఎంపిగా పోటీ చేసే ఓపికి లేదని ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పేశారు.

 

నరసరావుపేటలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎంపి రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. ఎంపిగా పోటీ చేయటానికి ఇష్టపడటం లేదని మచిలీపట్నం ఎంపి కొనకళ్ళ నారాయణ చంద్రబాబుతో చెప్పారట. ఒంగోలు, కాకినాడ, అమలాపురం, బాపట్ల నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్ధితి కనబడుతోందట.  అందుకే టిడిపికి వచ్చే ఎన్నికల్లో కనీసం 12 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధుల కోసం చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నారు. బహుశా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే ఏమో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో వైసిపి 21 స్ధానాలు వస్తాయని జాతీయ మీడియా సర్వే ఫలితాలు చెబుతున్నాయ్.