మంత్రి రజని మాటలకు సీఎం జగన్ కరిగిపోతారా.?

రాజకీయాల్లో పొగడ్తలు మామూలే.! అసలు పొగడ్తలు లేకపోతే, రాజకీయమే లేదన్నట్టు తయారైంది పరిస్థితి. ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా వుండేది. తద్వారా, పార్టీలో జరిగే తప్పొప్పులపై ఖరాఖండీ అభిప్రాయాలకు ఆస్కారముండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరే. అంతర్గత ప్రజాస్వామ్యమంటే కుమ్ములాటలుగా మారిపోయాక, పార్టీల అధినేతలు.. కేవలం భజనపరుల్ని మాత్రమే తమ చుట్టూ వుంచుకుంటున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీలదీ అదే తంతు.

తాజాగా, చిలకలూరిపేటలో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి విడదల రజని, ఉద్వేగతంతో కూడిన ప్రసంగం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు అవకాశం రావడం పట్ల ఆమె ఆనంద భాష్పాలు విడుస్తూ, అదంతా వైఎస్ జగన్ పెట్టిన ‘భిక్ష’ అని చెప్పుకొచ్చారు.

కాలగమనంలో, కాస్త వెనక్కి వెళితే.. ‘చంద్రబాబుగారూ.. మీరు హైటెక్ సిటీ పెట్టారు.. అలా మీరు స్థాపించిన హైటెక్ సిటీలో మొలిచిన మొక్కని నేను..’ అంటూ టీడీపీలో వున్నప్పుడు విడదల రజని, అప్పట్లో చంద్రబాబు మీద ప్రశంసలు గుప్పించారు.. ఇంతే భావోద్వేగంతో కంటతడి పెట్టినంత పన్జేశారు.

టీడీపీలో వున్నప్పుడు రోజా కూడా ఇలానే చేశారు. అప్పట్లో తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ పని చేశారామె. చంద్రబాబుని ఆకాశానికెత్తేశారు. ఇప్పడామె వైసీపీలో వున్నారు, చంద్రబాబుని నిత్యం తిడుతూనే వున్నారు. రాజకీయమంటేనే అంత.! అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్.. తర్వాత విడదల రజని, ఆనందభాష్పాలు ఎవరి సమక్షంలో విదుల్చుతారో.!