ఇది ప్రజాస్వామ్య దేశం. రాజకీయ నాయకులు ఎన్ని ఎత్తులేసినా.. మరెన్ని జిత్తులేసినా.. ప్రజలు తలచుకుంటే వాటన్నింటినీ తుత్తినీళు చేయగలరు. ఈ విషయాన్ని మరిచారో ఏమో… రాజకీయాల్లో పొత్తులుంటే చాలు అనుకుని సీనియర్ పొలిటీషియన్ బాబు.. పవన్ తో ముందుకు కదులుతున్నారు. అయితే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా ప్రజలను రిక్వస్ట్ చేసుకుంటున్న బాబు & కో లకు ఇప్పుడు ఉమ్మడి గోదావరి – ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలతో పెద్ద సమస్య వచ్చి పడబోతుందని చెబుతున్నారు విశ్లేషకులు!
పొత్తుల వల్ల.. పైకి కనిపించే లాభాల కంటే.. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నల కంటే.. కార్యకర్తలను సమాధానపరచుకోవాల్సిన సందర్భాలకంటే… కంటికి కనిపించని సమస్యలు బోలెడన్ని ఉంటాయి. ప్రస్తుతం టీడీపీ నేతలకు అవే ఎదురవ్వబోతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. కారణం… తనకు రాయలసీమలో బలం లేదు.. అక్కడ జనసేన అభిమానులు లేరు.. ఉన్నా వారితో పెద్దగా ప్రయోజనం లేదు.. తన బలం అంతా ఉమ్మడి తూర్పు గోదావరి – ఉత్తరాంధ్ర జిల్లాలే అని పవన్ బలంగా చెప్పారు. దానర్ధం… తనకు ఇవ్వాల్సిన 30 – 40 సీట్లు ఆ జిల్లాల నుంచే ఇవ్వాలని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదే చంద్రబాబు సీనియారిటీ గ్రహించని అసలు సమస్య అంటున్నారు విశ్లేషకులు.
కారణం… పవన్ తన పార్టీకి బలం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి ఉత్తరాంధ్రా జిల్లాలలో మొత్తం 68 సీట్లు ఉన్నాయి. పవన్ తన స్థాయిని ఎంత దిగజార్చుకున్నా… చూసేవారి కోసమైనా కనీసం వాటిలో సగం సీట్లయినా బాబు కేటాయించవలసి వస్తుంది. అంటే… ఇంతకాలం పార్టీని కాపాడుకుంటూ, కొన్ని సందర్భాల్లో జనసేన నేతలతో సైతం పోరాడుకుంటూ.. పార్టీని నాలుగేళ్లుగా కాపాడిన గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 34 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు “త్యాగాలు” చేయాలి!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయిన మహామహులైన టీడీపీ నేతలు ఈ జిల్లాల్లోనే ఉన్నారు. పైగా బలమైన నేతలు కూడా ఇక్కడే ఉన్నారు. అంత బలమైన చోట 30 నుంచి 40 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను… జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వెనక ద్వితీయ శ్రేణి నేతలా తిరుగుతూ.. ప్రచారం చేయాలని బాబు ఒప్పించాలన్నమాట. ఇందుకు సదరు నాయకుడు ఒప్పుకున్నా… ఆత్మాభిమానం కలిగిన క్యాడర్ ఒప్పుకుంటారా?
ఫలితంగా… టీడీపీలో అసంతృప్తి బలంగా చెలరేగి అంతిమంగా అది వైసీపీకి మేలు చెసే ప్రమాదం లేకపోలేదు! పైగా ఈదఫా సుమారు 40 – 50 మంది సిట్టింగులను జగన్ మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఫలితంగా ఆయా స్థానలపై టీడీపీ అసంతృప్తులు కర్చీఫులు వేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు! కాబట్టి… జనసేనకు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, కుదిరితే.. కృష్ణా, గుంటూరు జిల్లాలతో కలిపి 20 సీట్లకు మించి ఇవ్వకుండా ఒప్పించగలిగితే ఈ పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అలా కానిపక్షంలో… పవన్ ని నమ్ముకుని.. చంద్రబాబు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్లవుతుందని.. ఫలితంగా మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు టీడీపీ శ్రేయోభిలాషులు!