భీమిలిలో జన సంద్రం.! ఎన్నికల సమరశంఖం పూరించిన వైఎస్ జగన్.!

2024 ఎన్నికలకోసం సమర శంఖాన్ని పూరించేశారు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘వై నాట్ 175’ అనే మాటకే కట్టుబడి విషయాన్ని వైఎస్ జగన్ స్పష్టం చేసేశారు. ‘భీమిలి’ బహిరంగ సభ సాక్షిగా.!

జనం పోటెత్తారు.. భీమిలి బహిరంగ సభా ప్రాంగణం జన సంద్రాన్ని తలపించింది. ఏర్పాట్లు పక్కాగా చేశారు.. జనాన్ని బీభత్సంగా తరలించారు. చిన్నా చితకా ఘటనల్ని మినహాయిస్తే, సభ సజావుగానే సాగింది.

వేదికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్పిడెంట్‌గా మాట్లాడారు. వచ్చిన జనాలకి పెద్దగా ఇబ్బందులేమీ లేకుండానే ఏర్పాట్లు జరగడంతో వైసీపీ అధినాయకత్వం కూడా ఊపిరిపీల్చుకుంది. వచ్చిన జనంలో ఎంతమంది తమ మాటల్ని నమ్మి, తమకు ఓటేస్తారన్నదానిపై వైసీపీకి ఓ అంచనా వుంటుందనుకోండి.. అది మల్ళీ వేరే చర్చ.

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు కదా.. ఆ ప్రస్తావన లేదేంటి.? విశాఖలో కాపురం అన్నారు కదా.. దాని గురించి మాట్లాడలేదేంటి.? ఇలాంటి ప్రశ్నలు సభా ప్రాంగణంలో కొందరు జనం చర్చించుకోవడం కనిపించింది.

సమరశంఖం అంటే, ఎన్నికలకు సంబంధించిన తొలి బహిరంగ సభ గనుక.. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడి వుంటే బావుండేదన్న చర్చ వైసీపీ శ్రేణుల్లోనూ జరిగింది.

కాగా, తొలి బహిరంగ సభ ఉమ్మడి విశాఖ జిల్లాలో జరగడంతే, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని జిల్లాకి చెందిన వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.