విజయవాడలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు బీభత్స సృష్టించింది. బెజవాడలోని బిఆర్ టిఎస్ రోడ్డు పై స్కూల్ బస్సును నిర్లక్ష్యంగా నడిపడంతో ఈ ప్రమాదం జరిగింది. మారుతీ నగర్ బ్రాంచ్ కు చెందిన స్కూల్ బస్సుకు రోజు వచ్చే డ్రైవర్ లీవ్ పెట్టడంతో అతని స్థానంలో ఒక్క రోజు కోసం దుర్గారావు అనే డ్రైవర్ ను పెట్టారు. అతను స్కూల్ పిల్లలను ఎక్కించుకొని పాఠశాలకు వస్తున్నాడు. బస్సు శారదా కాలేజి సెంటర్ దగ్గరకు వచ్చింది. అక్కడ ముందు పలు వాహనాలు ఉన్నా కూడా బస్సును ఆపకుండా వారిని గుద్దుకుంటూ తీసుకెళ్లాడు.
దీంతో పండ్ల బండ్లు, ఆటో, బైక్ ల మీద ఉన్నవారంతా కిందపడిపోయారు. షేక్ మస్తాన్ వలీ అనే పండ్ల వ్యాపారకి తీవ్ర గాయాలయ్యాయి. మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సును రోడ్డు మీదనే వదిలి దుర్గారావు పరారయ్యాడు. పోలీసులు స్కూల్ పిల్లలను మరో వాహనంలో పంపించి బస్సును స్టేషన్ కు తరలించారు. క్షణాల్లో బస్సు బీభత్సం సృష్టించడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.