ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నా కొంతమంది చేస్తున్న తప్పుల వల్ల ప్రభుత్వం పరువు పోతుండటం గమనార్హం. తాజాగా ఒక సాధారణ మహిళ జగన్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తన కొడుకు చనిపోతే ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల సాయం అందిందని అయితే మంత్రి అంబటి రాంబాబు ఆ డబ్బులో రెండున్నర లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారని సదరు మహిళ చెబుతున్నారు.
సీఐ నుంచి మున్సిపల్ ఛైర్మన్ నుంచి డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరింపులు వచ్చాయని మహిళ పేర్కొన్నారు. సీఐ బెదిరింపుల వల్ల చనిపోవాలని అనుకున్నామని కానీ అమ్మాయి ఎలా బ్రతుకుతుందనే కారణంతో ఆగామని సత్తెనపల్లికి చెందిన గంగమ్మ, పర్లయ్య దంపతులు కామెంట్లు చేశారు. అయితే అంబటి రాంబాబు మాత్రం జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే బాధిత మహిళ మాత్రం జనసేన సహకారంతో ధర్నా చేయడం గమనార్హం. అయితే తప్పు అంబటి రాంబాబుదా? లేక అంబటి రాంబాబు గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. బాధితులకు పరిహారం అందే వరకు జనసేన పోరాడుతుందని జనసేన నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని అసలు తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాల్సి ఉంది. పరువుకు భంగం కలిగించే విషయాలకు సంబంధించి జగన్ సర్కార్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
పార్టీ పరువు తీసే రాజకీయ నేతల విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తే మాత్రమే రాబోయే రోజుల్లో ఈ తరహా ఘటనలు రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంబటి రాంబాబుపై వస్తున్న విమర్శల విషయంలో వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి. ఇలాంటి ఆరోపణల వల్ల అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్న జగన్ కు ఎలాంటి ఫలితాలు దక్కుతాయో తెలియాల్సి ఉంది.