వెంకటేశ్వరస్వామి సర్వదర్శన భాగ్యం.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.!

కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం భక్తులకు లభించడంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. రెండో వేవ్ నేపథ్యంలో ఈ ఇబ్బందులు ఇంకాస్త ఎక్కువయ్యాయి. అయితే, 300 రూపాయల టిక్కెట్ కొనుగోలు చేసినవారికి పెద్దగా ఇబ్బందుల్లేవ్.. ఇబ్బందులు పడ్డది సర్వదర్శనం కోరుకునే సామాన్య భక్తులే. ఎలాగైతేనేం, చాలా రోజుల తర్వాత.. కొన్ని నెలల తర్వాత సర్వ దర్శన భాగ్యం కలుగుతోంది వెంకటేశ్వరస్వామి భక్తులకి. ముందుగా చిత్తూరు జిల్లాకి చెందినవారికి మాత్రమే సర్వదర్శన టోకెన్లు.. అదీ రోజుకి 2 వేల టోకెన్లు మాత్రమే అందిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు ఏ ఆలోచనతో సర్వదర్శనాన్ని నిలిపివేశారోగానీ, ఈ నిర్ణయం మాత్రం భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కోటీశ్వరుడికీ కరోనా సోకుతుంది.. బీదవాడికీ కరోనా సోకుతుంది.

అలాంటప్పుడు, 300 రూపాయల టోకెన్లు ఎలాగైతే జారీ చేశారో.. అదే సంఖ్యలో సర్వదర్శన టోకెన్లు కూడా జారీ చేస్తే ఏంటి సమస్య.? ఈ ప్రశ్నకు ప్రభుత్వ పెద్దల దగ్గర సరైన సమాధానం లేదు. దేవుడి ముందు భక్తులందరూ సమానమే అయినప్పుడు.. ఈ టిక్కెట్ల గోల ఏంటి.? అనేది ఇంకో చర్చ. కేవలం హిందూ దేవాలయాల్లోనే ఈ టిక్కెట్ల ప్రసహనం ఎందుకు.? అనే ఆవేదన సగటు హిందువుల్లో ఎప్పటినుంచో వ్యక్తమవుతూనే వుంది. వైఎస్ జగన్ హయాంలోనే కాదు, అంతకు ముందు కూడా ఈ టిక్కెట్ల వ్యవహారం నడిచింది.. నడుస్తూనే వుంది. సరే, సర్వదర్శనానికి టీటీడీ అనుమతించడం మంచి విషయమే. అయితే, అది వీలైనంత ఎక్కువమంది భక్తులకు అందేలా చూడటం టీటీడీ తక్షణ కర్తవ్యం. కేవలం ధనార్జన కోసమే.. అన్నట్టుగా టీటీడీ వ్యవహరిస్తోన్న విమర్శలకు ప్రభుత్వ పెద్దలు చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది.