సంక్షేమం.. అతి పెద్ద ఫెయిల్యూర్ అవుతుందా.?

సంక్షేమ పథకాల పట్ల రాజకీయ పార్టీలు ఎందుకు ప్రత్యేకమైన ఆశక్తి ప్రదర్శిస్తుంటాయి.? అధికారంలోకి వస్తే ఫలానా సంక్షేమ పథకం అమలు చేస్తామంటూ, రాష్ట్రం లేదా దేశం శక్తికి మించిన హామీల్ని ఎందుకు రాజకీయ పార్టీలు ఇవ్వడం జరుగుతుంటుంది.? దీనిపై చాలాకాలంగా దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతూనే వున్నాయి.

సంక్షేమం అంటేనే ఓటు బ్యాంకు రాజకీయం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎవరు ఎన్ని మాటలు సంక్షేమానికి అనుకూలంగా మాట్లాడినా అవన్నీ బూటకమే. సంక్షేమం తాలూకు అసలు అర్థం వేరు. ఇప్పుడు నడుస్తున్న సంక్షేమం వేరు. అప్పులు చేసి, సంక్షేమ పథకాలు అందిస్తే.. వాటి వల్ల ప్రయోజనమేంటి.? రాష్ట్రం, దేశం అప్పుల పాలవడం తప్పితే.

చంద్రబాబు హయాంలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి.. కానీ, చంద్రబాబు ఇంకోసారి అధికారం దక్కించుకోలేకపోయారు. ఈ విషయమై వైసీపీ వాదన వింతగా వుంటుంది. ‘చంద్రబాబు హయాంలో పచ్చ చొక్కాలకే సంక్షేమ పథకాలు’ అన్నది వైసీపీ వాదన. వైసీపీ హయాంలో బులుగు చొక్కాలకే సంక్షేమ పథకాలని టీడీపీ ఆరోపించడం మామూలే.

అటు వైసీపీ చెప్పిందీ నిజమే, టీడీపీ చెబుతున్నదీ నిజమే. అలాగని, సామాన్యులకు సంక్షేమ పలాలు దక్కవా.? అంటే, దక్కుతాయ్.. కానీ, అందులోనూ రాజకీయమే. అందుకే, ఎన్నికలొస్తే, కేవలం సంక్షేమ పథకాల కోణంలో జనం ఓట్లేయరు. చాలా అంశాలు ఓటర్లపై ప్రభావం చూపుతాయ్.

అభివృద్ధి ఫలాల్లో కొంత భాగం సంక్షేమానికి వినియోగిస్తే, అది వేరే లెక్క. అభివృద్ధి సున్నా, సంక్షేమం ఘనం.. అంటే, అది మరీ దారుణం. సంక్షేమం విషయమై వైసీపీ అప్పుల్నే నమ్ముకున్న దరిమిలా, ఆ సంక్షేమమే వైసీపీ కొంప ముంచేయనుందన్నది నిర్వివాదాంశం.