సంక్షేమ పథకాలతో ఓట్లు రాలవా.? ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది.?

ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమే, సంక్షేమ పథకాలంటూ ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోల్లో ‘ఉచిత హామీలు’ ఇవ్వడం.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం’ సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలు బాగా వర్కవుట్ అయ్యాయి. అధికారంలోకి వస్తూనే, మహిళలకు తెలంగాణలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా కల్పించింది రేవంత్ రెడ్డి సర్కారు.

అయితే, కేసీయార్ హయాంలో కూడా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కానీ, వాటిని చూసి, జనం తిరిగి గులాబీ పార్టీకే పట్టం కట్టలేదు. అంటే, సంక్షేమ పథకాల్ని అనుభవిస్తూ, ఆ పథకాలు ఇచ్చిన పార్టీ గురించి పాజిటివ్‌గా ఆలోచించలేదన్నమాట.

ఇందులో కొంత వాస్తవం వుంది.! అలాగని, పూర్తిగా ఇదే వాస్తవం.. అని చెప్పడానికీ వీల్లేదు. ఎందుకంటే, ప్రభుత్వ వ్యతిరేకత అనేది సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా పని చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే ఈక్వేషన్ వర్కవుట్ అవబోతోందా.?

అమ్మ ఒడి పథకానికి జనం నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. అదే సమయంలో, మిగతా సంక్షేమ పథకాల విషయంలో జనంలో ప్రభుత్వం పట్ల అంత సానుకూలత కనిపించడంలేదు. ‘ఇచ్చాడులే.. తిరిగి మా మీద అప్పుల భారం మోపాడు.! ధరల మోత మరీ దారుణం’ అని పలువురు ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా, టీడీపీ ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్ని ఎన్నికల హామీగా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి మేనిఫెస్టో త్వరలో విడుదల కాబోతోంది. జనసేన – టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి గనుక, ఉమ్మడి మేనిఫెస్టో రానుంది. అందులో మరిన్ని ఉచిత హామీలు వుండబోతున్నాయ్.

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలుంటాయ్. ఈ విషయంలో జనానికి పెద్దగా అనుమానాలుండవ్. పాలన సరిగ్గా వుందా.? లేదా.? సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాగుందా.? లేదా.? వంటి అంశాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయ్.!