వైసీపీలో ‘సజ్జల’ పెత్తనం పెరుగుతోందా.? వారసుడి ఎంట్రీ దేనికి సంకేతం.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డికి వున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైసీపీలో ఆయనే నెంబర్ టూ.! అధినేత వైఎస్ జగన్ నెంబర్ వన్ పొజిషన్‌లో వుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి రెండో స్థానంలో వుంటారు.

ఈ స్థానం కోసం విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య గతంలో గట్టి పోటీ వుండేది. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి.. పొలిటికల్ ట్రాక్ ఎప్పుడో తప్పేశారు. విజయసాయిరెడ్డి ఇమేజ్ సైతం పార్టీలో తగ్గుతూ వచ్చింది. సకల శాఖ మంత్రి.. అనే ట్యాగ్ సజ్జల ముందుకు వచ్చి చేరింది.

త్వరలో, అతి త్వరలో సజ్జల రామకృష్ణారెడ్డి వారసుడు కూడా, రాజకీయంగా ఘనమైన తెరంగేట్రం చేయబోతున్నారట. సజ్జల తనయుడు భాగర్గవరెడ్డికి వైసీపీ అధినేత వైఎస్ జగన్, సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

2024 ఎన్నికల్లో వైసీపీకి సోషల్ మీడియా నుంచి పూర్తి మద్దతు అవసరం. వైసీపీ సోషల్ మీడియా విభాగం పటిష్టంగానే వున్నా, ఈ మధ్య దారి తప్పింది. ఈ నేపథ్యంలో ఆ విభాగంలో సంస్కరణల నిమిత్తం భార్గవరెడ్డిని సజ్జల రంగంలోకి దించగా, భార్గవరెడ్డి విషయంలో వైఎస్ జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ప్రస్తుతానికైతే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వున్నారు. ముందు ముందు ఆయన కీలకమైన మంత్రిత్వ శాఖకు మంత్రి అవుతారనే ప్రచారమూ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం మాత్రం సజ్జలకు లేదట. అదే సమయంలో సజ్జల తన కుమారుడ్ని వచ్చే ఎ న్నికల బరిలోకి దింపాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా, సజ్జలకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యంపై మిగతా ఇద్దరు ‘రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుల్లో’ ఒకింత అసహనం పెరుగుతోందనీ, అధినేత వద్ద ఈ విషయమై పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, వైఎస్ జగన్ ఏం చెబితే అది తూ.చ. తప్పకుండా పాటించే సజ్జల విషయంలో వైఎస్ జగన్, ఇతరులు చెప్పే మాటలు వింటారా.? అన్నదీ అనుమానమే.