ఈ తెలివితేటలతోనేనా ఇంతకాలం సలహాలు… సజ్జలా?

తాజాగా వెలువడిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని తీసుకొచ్చాయనడంలో సందేహం లేదు. కారణాలు ఏవైనా.. పరిస్థితులు మరేవైనా.. టీడీపీ గెలిచింది. గత కొంతకాలంగా అందనిద్రాక్షలా ఉన్న “గెలుపు” మాట టీడీపీ చెవిన పడింది. దీంతో.. అందని ద్రాక్ష అందినంత ఆనందంలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. అయితే… ఈ సందర్భంగా వైకాపా నేతలు చెబుతున్న మాటలు ఒకెత్తు అయితే… సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి చేస్తున్న వాదన మరోకెత్తు!

వైకాపా నాయకులు పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తున్నారు. పొరపాట్లు సర్ధుకుంటామని చెబుతున్నారు. ఈ సమయంలో రోజాలాంటి నేతలైతే… 12మందిని చంపిన సింహం గురించి మాట్లాడుకోకుండా.. ఇద్దరిని కరిచిన పంది గురించే ఎక్కువ ప్రచారం అంటూ తనదైన సెటైర్స్ వేశారు. ఆగ్రహం, ఆక్రోశం కలగలిపిన ఆమాటలను అర్ధం చేసుకోవచ్చు. ఇదే సమయంలో.. మూడు రాజధానుల నిర్ణయానికి ఈ ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లోనూ రెఫరెండం కాదని చెబుతున్న వైకాపా నేతల మాటలనూ పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ… బలం లేదని ఒప్పుకుంటున్న సజ్జల మాటలే సామాన్య వైకాపా కార్యకర్తకు చికాకు తెప్పిస్తున్నాయి.

ఏ తెలివితేటలతో, మరే అర్హతతో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు అయిపోయారో తెలియదు కానీ… ఆయనలో ఏమి చూసి జగన్ ఆ స్థాయిలో విలువనిస్తున్నారో సామాన్య కార్యకర్తలకు అర్ధంకాదు కానీ… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల అనంతరం స్పందించిన సజ్జల… “పట్టబద్రుల ఓటర్లలో తమ మద్దతుదారులు తక్కువగా ఉన్నారు” అని చెబుతున్నారు. అంటే… పట్టభద్రుల ఓటర్లు త‌మ‌కు వ్యతిరేకమని సజ్జల చెప్పదలుసుకున్నారా? ఆ విషయం తెలిసి కూడా బ‌రిలో దిగార‌ని అర్థం చేసుకోవాలా? ఓడిపోయి తెలుగుదేశం పార్టీకి ఆక్సిజ‌న్ ఇవ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిందని అనుకోవాలా? సజ్జల మాట‌ల పరమార్ధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి!

ఇంతకుమించిన అజ్ఞానపు వాదన ఉంటుందా…? “ఇది కేవలం పట్టబద్రుల తీర్పు మాత్రమే.. సామాన్య ప్రజానికం మొత్తం అభిప్రాయం కాదు..” అని చెప్పుకున్నా పర్లేదు కానీ… పట్టబద్రులు జగన్ ని నమ్మడం లేదన్నట్లుగా, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ లో తమకు బలం లేదన్నట్లుగా మాట్లాడటం అర్ధజ్ఞానానికి అజ్ఞానానికి మద్య కొట్టుమిట్టాడటం కాక మరేమిటి?

ఎందుకంటే… 2019సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ ని బాగా నమ్మినవారిలో మహిళలు, మధ్యతరగతి ప్రజానికంతోపాటు యువత కూడా ఎక్కువే. ఇక సచివాలయాలు – వాలంటీర్ల వ్యవస్థతో పట్టబద్రులైన యువత విషయంలో జగన్ కి ప్లస్ మార్కులే పడ్డాయి. కాకపోతే వాటిని… పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు మైనస్ గా మార్చేసాయి. ఆ విషయం సజ్జలకు తెలియకపోవడం దారుణం.

ఎందుకంటే… ఈ ఎన్నికల్లో జగన్ ని దెబ్బకొట్టింది పట్టబద్రుల్లో బలం లేకపోవడమూ కాదు.. మూడు రాజధానులపై ప్రజలకు మక్కువ లేకా కాదు.. ఎన్నికల్లో అవతవకలు అసలే కాదు. ఈ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం ముగ్గురు కన్వీనర్లు! అవును… సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పరిస్థితులు అంచనా వేయకుండా కేవలం ఆప్తులను నియమించుకోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణం!! వీరు ముగ్గురూ నమ్మకమైన వారే కనుక తనకు ఇబ్బంది ఏమీ ఉండదని జగన్ భ్రమించడం మరో కారణం! నాలుగేళ్లుగా నెత్తీ నోరు మొత్తుకుంటున్నా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు సమసి పోయేలా చేయకపోవడం మరో ప్రధాన కారణం. ఫలితం… గెలవాల్సిన ఎన్నికల్లో చతికిలబడటం!

సో… ఇకనైనా “వైకాపా పరువు తీసే మాటలు, జగన్ స్థాయిని తగ్గించే స్టేట్ మెంట్లూ, కార్యకర్తలను కన్ ఫ్యూజ్ చేసే కబుర్లూ” మాని … అన్ని వర్గాల్లోనూ జగన్ కి బలం ఉందని గ్రహించి.. ఒంటెద్దు పోకడలకు పోకుండా – జగన్ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సజ్జల!! అనేది వైకాపా కార్యకర్త మాటగా ఉంది!