అసమాన వాక్పటిమ.. అదే ఆయన మహిమ.. ఒక ప్రవాహం.. ఏ పాత్రయనా ఆవాహం.. ఆయన రావణుడైతే పది తలల భావాలు ఒక్క వికటాట్టహాసంలోనే.. సుయోధనుడైతే పంచ పాండవుల నటనా ప్రాభవం అడవి గాచినదే..!
భీముని పద విన్యాసం.. పద్యాల విహారం.. ధిక్ తో తీసిపోయే కథక్కే .. రాక్షసరాజు హిరణ్యకశిపునిది విశ్వనటచక్రవర్తి అంతటి భీకర రూపమా.. రోజారమణి ఎలా తట్టుకుందో ఆరడుగుల గంభీరమూర్తిని..! హిమాలయమంత ఎత్తుకు చేర్చలేదా ఆ రంగుల సినిమా ఎస్వీఆర్ కీర్తిని..!
నర్తనశాల కీచకుడు విదేశ ప్రధానినే మెప్పించి కంట తడి పెట్టించిన ఘనుడు.. నేపాలీ మాంత్రికుడిగా చిత్రవిచిత్ర సంభాషణలు పలికి సినిమా ఢింభకుడై.. హిడింబి కుమారుడై నటపృధివినెల్ల శాసించి కోటి వీర తాళ్ళు వేసుకోలేదా.. నోటి మాటల బాణాలు సంధించ లేదా..!
దక్షుడై నిఠలాక్షునే మించిన అభినయం.. భీష్ముడై కురుకుమారుల అనునయం.. హరిశ్చంద్రుడై కష్టాల కాపరై.. పాత్రలు చరిత్రలై.. నటన పాఠమై..!
ఆయన సినిమారంగ పెద్ద.. సాంఘిక సినిమాల ఇంటి పెద్ద.. పండంటికాపురంలోని విషాదం.. విచిత్రబంధంలోని నిర్వేదం.. మంచిమనసులులో కూతురితో న్యాయవాదం.. కత్తులరత్తయ్య పిడివాదం.. ప్రతినాయకుడిగా హీరోలతో సంవాదం.. ఏం చేసినా రంగారావుకే చెల్లు.. హుంకరిస్తే చెవులు చిల్లు! పిల్లలు భీతిల్లు..!!
ఆయన నటన అసమానం.. పాత్రపోషణ అద్వితీయం.. అందుకే అయినాడు ఆ నట తపస్వి.. చిర యశస్వి..!
ఎస్ వి రంగారావు వర్ధంతి సందర్భంగా ప్రణామాలు అర్పిస్తూ..