ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు అందుకే ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రైవర్ వృత్తిలో ఉన్నవారు ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించిన ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.తాజాగా ఇలాంటి ఓ ప్రమాద ఘటన నుంచి 40 మంది ప్రాణాలను కాపాడారు ఆర్టీసీ డ్రైవర్. ఈయన సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం జరగకుండా ఆపారు. అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే…
శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చీరాల డిపో నుంచి ఒక ఎక్స్ ప్రెస్ బస్సు విజయవాడకు బయలుదేరింది. మొత్తం 40 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఈ బస్సుస్థానిక కొమ్మూరు కాలువ వద్దకు రాగానే ఎదురుగా రెండు లారీలు వేగంగా వస్తున్నాయి. అయితే ఒక ద్విచక్ర వాహన దారుడు ఆ రెండు లారీలను ఓవర్టేక్ చేయడానికి ఎంతో వేగంతో ప్రయాణం చేశారు. ఈ విషయాన్ని చివరి క్షణంలో గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్ వేశారు.
వర్షం కారణంగా సడన్ గా బ్రేక్ వేయడంతో బస్సు రోడ్డు మార్జిన్ దిగింది.వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో హ్యాండ్ బ్రేక్ వేసి స్టీరింగ్ చాలా గట్టిగా పట్టుకున్నారు అప్పటికే బస్సు ముందరి చక్రాలు కాలువ పక్కకు ఒరిగి ఆగిపోయింది.అయితే ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చెందగా డ్రైవర్ వారిని అప్రమత్తం చేసి ఎలాంటి ప్రమాదం జరగదని ధైర్యం చెప్పి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి అటువైపుగా వెళుతున్నటువంటి వారి సహాయంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఇలా సమయస్ఫూర్తితో 40 మంది ప్రాణాలను కాపాడటంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్ రమేష్ పై ప్రశంసలు కురిపించారు.