రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ల ఫిదా

తెలంగాణ తాజా రాజకీయాల్లో టాప్ లీడర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు  కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి. రేవంత్ వయసులో చిన్నవాడైనా ఎక్స్ ప్రెస్ స్పీడ్ తో రాజకీయాల్లో దూసుకొచ్చాడు. కొండనే ఢీకొట్టే నైజం రేవంత్ ది. అందుకే ఆయన అనతికాలంలోనే పొలిటికల్ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. తెలంగాణలో కాకలు తీరిన కాంగ్రెస్ యోధులు, మాజీ మంత్రులుగా పనిచేసిన కాంగ్రెస్ హేమాహేమీలే నేడు రేవంత్ కు ఫిదా అయ్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో రేవంత్ స్థానమేంటి? రేవంత్ కు ఫిదా అయిన కాంగ్రెస్ సీనియర్లెవరు? రేవంత్ ను లైట్ తీసుకున్న ఇంకొందరు పెద్ద లీడర్లు ఎవరు? చదవండి ఫుల్ స్టోరీ.

ఏడాది క్రితం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అగ్రస్థానాన్ని వదిలేసుకుని కాంగ్రెస్ లో చేరారు. టిడిపిలో వర్కింగ్ ప్రసిడెంట్ గా, శాసనసభా పక్ష నేతగా రేవంత్ ఉండేవారు. ఆ పదవులకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ కాంగ్రెస్ లో చేరగానే కాకలుదీరిన కాంగ్రెస్ యోధులు ఆయనను ఉత్త పుణ్యానికే పాతాళానికి తొక్కేస్తారు అని కొందరు విమర్శకులు అన్నారు. టిడిపిలో ఎదిగినంత స్పీడ్ గా రేవంత్ కాంగ్రెస్ లో ఎదగలేడు అని మరికొందరు కామెంట్స్ చేశారు. టిడిపిలో లిఫ్ట్ ఇచ్చే సంస్కృతి ఉంటే కాంగ్రెస్ లో తొక్కే సంస్కృతి ఉంటది కాబట్టి రేవంత్ ఇమడలేడు అని ఇంకొందరు సెలవిచ్చారు. కానీ ఏడాది కాలంలోనే రేవంత్ అలాంటి ప్రచారాలకు తన చతురతతో చెక్ పెట్టేశాడు. కాంగ్రెస్ పార్టీలో స్టార్ లీడర్ గా చెలామణి అవుతున్నాడు.

ఒకవైపు ఓటుకు నోటు కత్తి మెడలో వేలాడుతున్నా.. చాన్స్ దొరికితే నలిచిపారేయాలన్న కసితో తెలంగాణ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నా అదరక బెదరక తెగించి ముందుకు సాగిండు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ ను చీమలా నల్చి పారేస్తామనకున్న పాలకులు ఆయనను టచ్ చేయలేని స్థితికి చేరిపోయాడు. రేవంత్ రాజకీయ తెగువ చూసిన కాంగ్రెస్ ఉద్ధండ నేతలంతా ఇప్పుడు పుల్లలు పెట్టుడు, కాలు పట్టి గుంజి కింద పడేసుడు లాంటి కార్యకలాపాలేమీ చేయకుండా ఫిదా అవుతున్నారు.

చిన్నారెడ్డి నుంచి గీతా రెడ్డి వరకు…

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగానే తొలుత ఆయనను పిలిచి సభ పెట్టిన నాయకుడు జిల్లెల చిన్నారెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి చిన్నారెడ్డి. కమిట్ మెంట్ ఉన్న ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా చిన్నారెడ్డి పేరు తెచ్చుకున్నారు. అదృష్టం కలిసొస్తే సిఎం రేసులో ఉండే నాయకుడు చిన్నారెడ్డి. అటువంట ిచిన్నారెడ్డి తనకంటే వయసులో చిన్నవాడైన రేవంత్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి వనపర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ తర్వాత రేవంత్ పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో అమాంతం పెరిగిపోయింది.

చిన్నారెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు, జూనియర్ నేతలంతా మా నియోజకవర్గానికి రావాలంటే.. మా నియోజకవర్గానికి రావాలంటూ రేవంత్ ను కోరుతూ ఉన్నారు. చిన్నారెడ్డి సభ ముగిసిందో లేదో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు జె గీతారెడ్డి తన నియోజకవర్గంలో సభకు రేవంత్ ను జహీరాబాద్ కు ఆహ్వానించారు. కానీ రేవంత్ కు సమయం వెసులుబాటు కాకపోవడంతో ఆమె నిర్వహించిన సభకు వెళ్లలేకపోయారు. తర్వాత చాలా మంది నాయకులు రేవంత్ ను తమ నియోజకవర్గంలో పర్యటించాలంటూ విన్నపాలు చేస్తూనే ఉన్నారు.

geeta reedy

రేవంత్ ను ఆహ్వానించిన వారిలో మాజీ మంత్రులు చిన్నారెడ్డి, గీతారెడ్డి తర్వాత షబ్బీర్ అలీ, సునీతాలక్ష్మారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మల్లు రవి లాంటి వారు ఉన్నారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, గీతారెడ్డి నియోజవర్గాల్లో తప్ప మిగతా అందరి నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో రేవంత్ పాల్గొన్నారు. వీరే కాకుండా మెజార్టీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రావాలంటూ ఆహ్వానాలు పంపారు. దాదాపు 40 మందికి పైగా రేవంత్ తమ నియోజకవర్గంలో విజిట్ చేయాలంటూ ఆహ్వానాలు పంపినట్లు రేవంత్ సన్నిహితుడొకరు ‘తెలుగురాజ్యం’ కు చెప్పారు.

రేవంత్ ను పిలవని వారు ఎవరంటే..?

కాకలు తీరిన కాంగ్రెస్ సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే తమకు వర్కవుట్ అవుతుందని అంటుంటే కొందరు పెద్ద లీడర్లు మాత్రం ఆయనను లైట్ తీసుకున్నారు. ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నట్లు వ్యవహరించారు. చిన్నవాడైన రేవంత్ వచ్చి మా దగ్గర ప్రచారం చేయడమేంటని వారు భావించారో మరేదైనా కారణమో తెలియదు కానీ కొందరు పెద్ద నేతలు మాత్రం రేవంత్ ను ఆహ్వానించలేదు. అలా రేవంత్ ను లైట్ తీసుకున్న సీనియర్ నేతల్లో పిసిిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ, మాజీ మంత్రి డికె అరుణ, మాజీ చీఫ్ విప్, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు బట్టి విక్రమార్క ఉన్నట్లు రేవంత్ సన్నిహితుడు అందించిన సమాచారం. 

కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాస్ ఇమేజ్ కలిగి ఉన్నారు. వారు కూడా ఒక దశలో రేవంత్ ను నల్లగొండకు ఆహ్వానించారు. అయితే గతంలో నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సమయంలో సంతాప సభకు రావాలని రేవంత్ ను కోమటిరెడ్డి ఆహ్వానించారు. అప్పుడు ఆ సంతాప సభకు వెళ్లిన రేవంత్ కేసిఆర్ పైనా, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పైనా పరుషమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. టిఆర్ఎస్ నేతలను పొల్లు పొల్లుగా తిట్టి వచ్చారు. 

కాంగ్రెస్ పార్టీలో సినీ నటి విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ అని ప్రకటించినా అసలు స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డే అని యాదాద్రి జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.