కురుపాంలో వైసిపి బోణి కొట్టినట్లేనా ?

చంద్రబాబునాయుడు చేసిన ఓ పిచ్చిపని వల్ల పెద్దగా పోటీ లేకుండానే ఓ అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి ఖాతాలో పడబోతోంది. ఎందుకంటే, సదరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి వేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దాంతో ఇక్కడ వైసిపి విజయం చాలా తేలికైపోయింది. చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయమే పార్టీ కొంపముంచిదని పార్టీ నేతలు పాపం బోలెడు బాధపడిపోతున్నారు ఇపుడు.

విజయనగరం జిల్లాలో కురుపాం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గముంది. ఈ నియోజకవర్గానికి  ప్రస్తుతం వైసిపి ఎంఎల్ఏ పుష్ప శ్రీ వాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గట్టి అభ్యర్ధి అనుకుని జనార్ధన్ ధాట్రాజును చంద్రబాబు ఏరికోరి ఎంపిక చేశారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే, అభ్యర్ధి మాత్రం నామినేషన్ దశలోనే చతికిలపడ్డారు.

ఎందుకంటే, ధాట్రాజు అసలు ఎస్టీనే కాదట. అభ్యర్ధిని నిలబెట్టేటపుడు అతను ఎస్టీనా ? కాదా ? అనే విషయాన్ని కూడా చంద్రబాబు సరిచూసుకోకపోవటమే కొంప ముంచింది. ఇదే ధాట్రాజుపై 2012లోనే ఇదే విషయమై కేసు నమోదైంది. కేసును విచారించిన కోర్టు ధాట్రాజు అసలు ఎస్టీనే కాదంటూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు కూడా ఎప్పుడో కాదు వచ్చింది 2016లోనే.

2016లో ఎస్టీ కానీ ధాట్రాజు 2019కి ఎస్టీ ఎలా అయిపోతారు ? ఇంత చిన్న లాజిక్ కూడా చంద్రబాబు ఆలోచించకపోవటమే విచిత్రంగా ఉంది. పోటి చేయాలన్న ఉద్దేశ్యంతో నేతలు తమగురించి వంద మాటలు చెబుతారు. అవన్నీ నిజమా ? కాదా ? అని సరి చూసుకోవాల్సింది అధినేతే. ఎస్టీ కాదు అనే అంశమే ఇపుడు కూడా సమస్యగా మారింది. ప్రత్యర్ధులు కోర్టు తీర్పును చూపించిన తర్వాత రిటర్నింగ్ అధికారికి మాట్లాడటానికి ఏమీ లేక ధాట్రాజు నామినేషన్ ను కొట్టేశారు. బలమైన టిడిపి పోటీ లేకపోవటంతో వైసిపి దాదాపు విజయం సాధించేసినట్లే.