పవన్ కల్యాణ్ ఒక కొత్త పని పెట్టుకున్నారు. ఆయన పెట్టుకోలేదు కానీ… జనసైనికులకు పెట్టారు. శనివారం ఎవరూ ఇంట్లో ఉండొద్దని చెప్పారు. ప్రతీ జనసైనికుడు, జనసేన నేతా తమ తమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలను సందర్శించాలని కోరారు. ఈ విషయంలో శనివారం ఉదయం 10 గంటలనుంచి పని ప్రారంభించాలని సూచించారు.
అవును… ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ పై మరో షార్ట్ పిరియడ్ పోరాటానికి తెరలేపింది జనసేన. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుండి జనసేన నేతలు, కార్యాకర్తలంతా జగనన్న కాలనీలను సందర్శించాలని పిలుపిచ్చింది. ఈ మేరకు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని పేదవాళ్లు ఉండకూడదని జగన్ సర్కార్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ప్రభుత్వం.. పేదలకు ఇళ్ళపట్టాలిచ్చి జగనన్న కాలనీలను ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. పట్టాలిచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వమే కాలనీలను ఏర్పాటుచేస్తోంది. ఇదే సమయంలో అమరావతిలో సైతం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించింది.
ఈ సమయంలో ఏపీలో జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో చూడాలని జనసేన నిర్ణయించింది. ఇందులో భాగంగా… శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా తమ తమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలను సందర్శించాలని మనోహర్ తెలిపారు. ఇదే సమయంలో అక్కడి పరిస్థితులను ఫోటోలు, వీడీయోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. ఫలితంగా… జగనన్న కాలనీలు నీట మునిగిన వాటిని హైలెట్ చేయాలని చూస్తున్నారు!
ఆ సంగతి అలా ఉంటే… మరోవైపు ప్రస్తుతం కుర్తుసోన్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! భాగ్యనగరం మొత్తం వరదలతో నిండిపోయిందనే వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఈ వర్షాలవల్ల నదులు పొంగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సైతం మునిగిపోయిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నదులు పొంగి పొరలుతున్నాయి. బ్యారేజీలు వరద నీటితో నిండుకుండలా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. లంకగ్రామాలు మినిగిపోతున్నాయి. ఈ సమయంలో ఏపీలో జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో చూడాలని జనసేన నిర్ణయించింది.
దీంతో… పేదలకు జగన్ మంచి చేస్తుంటే… కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమానికి తెరలేపుతున్నారా అంటూ ఫైరవుతున్నారంట జగనన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు పొందిన పేదలు. దీంతో… రాష్ట్రవ్యాప్తంగా నీట మునిగిన పట్టణాలు, పొంగుతున్న వాగులు, మునిగిన హైవేలు, రైల్వే స్టేషన్ల ఫోటోలను పవన్ కు పంపాలని భావిస్తున్నారంట.