Red Book: ఏపీలో రెండు రెడ్‌బుక్‌లు?

ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి కాదు, రెండు రెడ్‌బుక్‌ల పాలన నడుస్తోందా?

లోకేశ్‌ రెడ్‌బుక్‌కు, డిప్యూటీ సీఎం పవన్‌ రెడ్‌బుక్‌ కూడా తోడయిందా?

అక్కడ సాధారణ పరిపాలన గాలికెగిరిపోయి కక్షలు, కార్పణ్యాలు రాజ్యమేలుతున్నాయా?

రాజకీయ ప్రత్యర్థులను జైళ్లకు తరలించే కార్యక్రమం అలా కొనసాగుతూనే ఉంటుందా?

వచ్చే దఫా మళ్లీ వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఈ టార్గెట్‌ రాజకీయాలు మరింత పెరుగుతాయా?

అంటే అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది.​‍

2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అసలు పాలన గాలికి వదిలేసి కక్ష పూరిత పాలనకే ప్రాధాన్యం ఇస్తోందన్న ఆందోళన జనంలో కనిపిస్తోంది. ఈ తొమ్మిది నెలల పాలనలో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడంపై చూపిన శ్రద్ధ హామీల అమలుపై చూపలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు రెడ్‌బుక్‌ ప్రకారం తాము రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడతామని క్రిస్టల్‌ క్లియర్‌గా చెప్పిన లోకేశ్‌ ఆ విధంగానే ముందుకుపోతున్నారు. ఇంకా చాలామందిపై కేసులు పెడతామని ఓపెన్‌గా చెబుతున్నారు. రెడ్‌బుక్‌ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని, అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకులను వేధించడం తగదని రాజకీయ పరిశీలకులు, తటస్థులు ఇప్పటికే సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలి జరిగిన అరెస్టులను పరిశీలిస్తే ఏపీలో ఒక రెడ్‌బుక్‌ కాదు రెండు రెడ్‌బుక్‌ల పాలన నడుస్తోంది అన్న అనుమానాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోకేశ్‌ రెడ్‌బుక్‌ ప్రకారం అరెస్ట్‌ చేయగా, సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్‌ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. లోకేశ్‌ మాదిరి పవన్‌కల్యాణ్‌ బాహాటంగా ప్రచారానికి దిగకపోయినా ఆయనకు ఒక రెడ్‌బుక్‌ ఉందని అంటున్నారు. లోకేశ్‌ ఇగోను శాటిస్‌ఫై చేయడానికి పోలీసు అధికారులు ఏవిధంగా అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారో.. అదేవిధంగా వారు పవన్‌ ఇగోను కూడా శాటిస్‌ఫై చేస్తున్నారు. లేకపోతే ఎప్పుడో పదేళ్ల కిందట అంటే 2015లో నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన కామెంట్స్‌ ఆధారంగా ఇప్పుడు కేసు నమోదు చేసి పోసానిని అరెస్ట్‌ చేయడమేంటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గతంలో వైఎస్సార్‌ సీపీ హయాంలో రాజకీయ ప్రత‍్యర్థులను అరెస్ట్‌ చేసినా స్టేషన్‌ బెయిల్‌పై ఇంటికి వచ్చేసేవారు. ఇప్పుడు రిమాండ్‌కు తరలించి జైలుకు పంపేవరకు రెడ్‌బుక్‌ పాలన శాంతించడం లేదు. అంటే ఉద్దేశ పూర్వకంగానే కఠినమైన, స్టేషన్‌ బెయిల్‌కు వీలులేని సెక‌్షన్లను జోడించి తమపై కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు అంటున్నారు. దీన్నిబట్టే టీడీపీ లీగల్‌ వింగ్‌ ఎంత గట్టిగా పనిచేస్తోందో అర్థమవుతోందని అంటున్నారు. ఇంత విచ్చలవిడిగా, అడ్డగోలుగా కేసులు పెడుతున్నా టీడీపీ, జనసేన శ్రేణులు తృప్తి పడడం లేదట? మాజీ మంత్రి రోజాను, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వంటి నాయకులను ఇంకా ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు. వారిని ఎప్పుడు జైలుకు తరలిస్తారని క్వశ్చన్‌ చేస్తున్నారట? అంటే కూటమి కూటమిలోని నాయకులదే కాక పార్టీల కేడర్ ఈగో కూడా శాటిస్ పై చేసే వరకు ఈ అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుందన్నమాట.

మీకు రెడ్ బుక్ ఉంటే మాకు ఒక బుక్ ఉంటుంది. మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంతకన్నా దీటుగా, గట్టిగా బదులిస్తాం. ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన నాయకులు, అధికారులు సప్త సముద్రాల అవతల దాక్కున్నా వెతికి పట్టుకుని మరీ శిక్షిస్తాం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నట్టు వైయస్సార్సీపి అధికారంలోకి వస్తే కూటమి నాయకుల స్టైల్ లోనే ప్రత్యర్థులపై కేసులు పెట్టి చట్ట పరిధిలో కక్ష తీర్చుకుంటారన్నమాట. ఎప్పుడో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసు పెట్టినట్టే కూటమి నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి పై, ఆయన కుటుంబం పై చేసిన వ్యాఖ్యలు ఆధారంగా కేసులు పెట్టడం ఖాయం అని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతలు జగన్ పై ఇన్నేళ్ళు వాడిన తిట్ల దండకం ఆధారంగా కేసులు పెట్టి జైల్లో వేస్తారన్నమాట. ఆ తర్వాత మళ్లీ కూటమి పార్టీలు అధి కారంలోకి వస్తే సీన్ రిపీట్! అంటే ఇది ఒక అంతులేని కథ.

ఇలా ఎవరి ఇష్టానికి వారు చెలరేగిపోతుంటే రాష్ట్రం ఏమవుతుంది. ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని ఇలా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగించుకుంటే రాష్ట్ర పాలన ఏం కావాలి అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక పార్టీని కాదని వేరే పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు అంటే సదరు పార్టీ నుంచి ఎంతో ఆశిస్తున్నారని నాయకుల అర్థం చేసుకోవడం లేదు. చక్కటి పాలన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, స్త్రీ బాలవృద్ధులకు రక్షణ వంటి అంశాలను జనం సహజంగా అధికార పార్టీ నుంచి కోరుకుంటారు. పార్టీలు కూడా ఇవన్నీ మేము ప్రజలకు అందిస్తాం అని చెప్పే ఓట్లు రాబట్టుకుని అధికారంలోకి వస్తాయి. తీరా అధికారంలోకి వచ్చాక ఇలా రాజకీయ కక్షలు తీర్చుకుంటూ పోతే సమాజం వర్గాలుగా చీలిపోయి శాశ్వత శత్రు శిబిరాలుగా విడిపోతుంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కులపరంగా విడిపోయిందని స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారు. దానికి బాధ్యులు ఎవరు రాజకీయ పార్టీలు కాదా? బ్రిటిష్ ఎంపైర్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ని అమలు చేసినట్టే తమ ఓట్ల కోసం సమాజాన్ని భిన్న వర్గాలుగా విభజించిన రాజకీయ పార్టీలు ఈ కక్షలు, కార్పణ్యాలను పెంచి పోషిస్తే ఆంధ్రప్రదేశ్ సమాజం తీవ్ర మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుందని మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు, నాయకులు పంతాలకు పోయి ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? అభివృద్ధి, సంక్షేమం మాట అటుంచి ఇంత ఘర్షణ వాతావరణంలో ప్రశాంతంగా జీవించడమే కష్టం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన లీడర్లు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కాకుండా విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు అయిన గాయాలకు మందు రాయడంపై దృష్టి సారించాల ని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కోరుకుంటోంది. ఇండియా అంటే ఇన్నాళ్లు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం గర్వంగా చెప్పుకునే వాళ్ళం. ఇలా కక్షలకు ప్రాధాన్యం ఇస్తే భవిష్యత్తులో అతి పెద్ద కక్ష స్వామ్య దేశంగా మారిపోతుందేమో మన నేతలు ఆలోచించాలి.