సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్న ఉపఎన్నికలు కావడంతో తిరుపతి లోక్ సభ బై ఎలక్షన్ల మీద అన్ని పార్టీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. సర్వ శక్తులను కూడగట్టుకుని బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మను రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో ఓడిన పనబాకను ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలని ట్రై చేస్తున్నారు. జగన్ కూడ తక్కువేమీ తినలేదు. తిరుపతి సిట్టింగ్ స్థానం కాబట్టి, ఆ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఉన్నది తమ ఎమ్మెల్యేలే కాబట్టి గెలుపు ఎలాగూ ఖాయం కాబట్టి ఈ ఎన్నికలను ఇంకొక రకంగా వాడుకోవాలని చూస్తున్నారు.
అవే స్థానిక ఎన్నికలు. ఎంతటి గొప్ప నాయకుడైనా అధికారంలో కూర్చున్న కొన్నాళ్ళకు ఎంతో కొంత వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఖాయం. ఎంత గొప్ప పైలాన్ అందించినా ఎక్కడో ఒక చోట లోటు మాత్రం కనిపించి తీరుతుంది. జగన్ సర్కార్ పరిస్థితి కూడ అదే. వేల కోట్లతో అప్పులు తెచ్చి మరీ సంక్షేమాన్ని అమలుచేస్తున్నా ఇసుక విధానం వలన భారీ సంఖ్యలో కూలీలు ఉపాధిని కోల్పోవడం, కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలను సమర్థించడం లాంటి పనుల వలన కొంత నెగెటివిటీ తెచ్చుకున్నారు. ఇది క్షేత్ర స్థాయిలో పనిచేసే ప్రమాదముంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది తప్పకుండా బయటపడుతుంది. ఈ వ్యతిరేకతను నమ్ముకునే చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని అనుకుంటున్నారు. అందుకోసం చేయాల్సిన పనులు ఎలాగూ చేస్తూనే ఉన్నారు.
కానీ జగన్ మాత్రం ముందు తిరుపతి ఉపఎన్నికలు జరిగితే ఆ గెలుపు ప్రభావంతో తమపై ప్రజల్లో రవ్వంత వ్యతిరేకత కూడ లేదని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఎవరెన్ని విధాలుగా ట్రై చేసినా స్థానిక ఎన్నికలను వెనక్కు నెడుతున్నారు. తిరుపతి విజయంతో నెగెటివిటీని తగ్గించుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించవచ్చని, అప్పుడు ప్రతిపక్షం మరింత బలహీనపడిపోతుందని ఆయన భావన. కాబట్టే ఇంకో ఐదారు నెలలు స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన రాకుండా చూస్తున్నారు. చంద్రబాబేమో ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే క్షేత్ర స్థాయిలో వైసీపీ మీద అసహనం ఉందని ప్రూవ్ చేసి 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ వేసుకోవచ్చని ఆశిస్తున్నారు.