రోజులు గడిచేకొద్దీ టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన కుట్రలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా శివాజీ, రవిప్రకాశ్ మధ్య జరిగిన షేర్ల కొనుగోలంతా బోగస్సే అని తేలిపోయింది. తామిద్దరి మధ్య జరిగిన షేర్ల లావాదేవీలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి టివి9 సంస్ధను ఎవరికీ అమ్మేందుకు లేదన్నట్లుగా శివాజీ కంపెనీ లా ట్రైబ్యునల్ లో ఫిర్యాదు చేశారు.
అసలు ఫిర్యాదు చేయటంపైనే అందరికీ అనుమానం వచ్చింది. ఎందుకంటే, ఇద్దరి మధ్య నడిచిన లావాదేవీల్లో ఎక్కడైనా మోసం జరిగిందంటే వెంటనే ఎవరైనా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మోసం చేసిన వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేస్తారు. అంతేకానీ శివాజీ లాగ కంపెనీ లా ట్రైబ్యునల్ లో కేసు వేయరు. పైగా తమ మధ్య లావాదేవీలు పూర్తయ్యేవరకూ సంస్ధను ఎవరికీ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయటంతోనే శివాజీ దురుద్దేశ్యం అర్ధమైపోయింది.
అయితే ఇదే విషయమై సైబర్ క్రైం పోలీసులు లోతుగా జరిపిన విచారణలో కొన్ని విషయాలు బయటపడ్డాయి. వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలకు తయారైన పత్రాలు కూడా నికీలీవే అని బయటపడింది. మొన్నటి ఏప్రిల్ తయారైన పత్రాలను పోయిన ఏడాది ఫిబ్రవరిలోనే తయారైనట్లుగా చూపించారు. అందుకు ఆధారాలుగా వారిద్దరి మధ్య నడిచిన ఈమెయిల్స్ బయటపడ్డాయి.
ఈ బోగస్ పత్రాలను విజయవాడకు చెందిన ఓ లాయర్ తయారు చేశారట. రవిప్రకాశ్ నుండి లాయర్ కు, శివాజీకి మధ్య నడిచిన ఈమెయిల్స్ ను సైబర్ క్రైం పోలీసులు బయటకు లాగారు. నిజానికి రవిప్రకాశ్ ఈమెయిల్స్ ను ఎరేజ్ చేసేశారు. అయితే సైబర్ క్రైం పోలీసుల బృందంలోని ఐటి నిపుణులు ఎరేజ్ చేసిన అన్నీ ఈమెయిల్స్ ను రిట్రైవ్ చేశారు. దాంతో రవిప్రకాశ్, శివాజి కుట్ర బయటపడింది.