యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ రాణి రుద్రమ దేవి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ వేయబోతున్నారు. రాణి రుద్రమదేవి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటి చేస్తారనుకున్నా పరిస్థితుల దృష్ట్యా ఆమె పోటి చేయలేకపోయారు. తాజాగా జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె పోటి చేయబోతున్నారు. ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ మద్దతుదారునిగా బరిలోకి దిగుతున్నారు. ఉద్యోగుల సంఘం నేత మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ టిఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. రాణి రుద్రమ దేవి బరిలోకి దిగడంతో అంతా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఉద్యమంలో రాణి రుద్రమదేవి కీలక నేతగా వ్యవహరించారు. ఆమె యాంకర్ గా పని చేశారు.
యాంకర్ రాణి రుద్రమ రెడ్డి టివి న్యూస్ చూసే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ జనాలకే కాదు ఆంధ్రా జనాలకు కూడా తెలిసిన మనిషి. తెలంగాణ ఉద్యమ కాలంలో రాణి రుద్రమ టిన్యూస్ సంస్థలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో రాణి రుద్రమ తనవంతు పాత్ర పోశించారు. టిన్యూస్ లో తెలంగాణ ఏర్పాటు కోసం చర్చలు, స్పెషల్ స్టోరీలతో ఉద్యమానికి ఊపిరిలూదారు. అంతకుముందు రాణి రుద్రమ ఈటీవీ, సాక్షి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెళ్లలో పనిచేశారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో 2010లో తెలంగాణ భవన్ లో టిన్యూస్ ప్రారంభమైంది. ఆ సంస్థలో రాణి అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. అయితే అనతికాలంలోనే టిన్యూస్ సంస్థ పాపులర్ కావడంలో రాణిరుద్రమ శక్తివంచనలేకుండా పనిచేశారు. అయితే ఆమె తదనంతర కాలంలో టిన్యూస్ వదిలేసి డైరెక్ట్ గా క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైసిపి అధినేత జగన్ ఆలోచన మేరకు అప్పుడు తెలంగాణలోని 5 జిల్లాలకు ఇన్ చార్జీగా ఉన్న జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసిపి పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుంచి వైసిపి క్యాండెట్ గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆమేరకు జగన్ నుంచి హామీ లభించడమే కాదు టికెట్ల కూడా అనౌన్స్ చేశారు. నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర విభజన జరిగిపోయింది. దీంతో తెలంగాణలో కీలక నేతలుగా ఉన్న కొండా దంపతులు, కేకే మహేందర్ రెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి లాంటి నేతలంతా వైసిపికి గుడ్ బై చెప్పారు. ఆ సమయంలోనే వరంగల్ జిల్లా కేంద్రంలో తాను వైసిపిని వీడుతున్నట్లు రాణి ప్రకటించారు. రాజీనామా లేఖను జగన్ కు పంపించేశారు.
వైసిపికి తెలంగాణలో స్థానం లేదని తెలుసుకున్న తర్వాత 2014 ఎన్నికల ముందే టిఆర్ఎస్ కు బద్ధ విరోధులుగా ముద్రపడ్డ కొండా దంపతులు కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిపోయారు. రాణి రుద్రమ తర్వాత కాలంలో ఏ పార్టీలోనూ చేరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మీడియాలోనూ కనిపించలేదు. ఆ సమయంలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. అయితే ఇటీవల హెచ్ఎం టివి నిర్వహించే దశ దిశ కార్యక్రమంతో మళ్లీ మీడియాలోకి వచ్చారు. ఆ తర్వాత జిట్టా బాలకృష్ణారెడ్డి స్థాపించిన యువ తెలంగాణ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
రాణి రుద్రమ దేవి రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండడంతో అనతికాలంలోనే రాజకీయంలో కీలక నేతగా ఎదిగారు. తాజాగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దీంతో రాణి రుద్రమ మరోసారి వార్తల్లో నిలిచారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచే విధంగా రుద్రమ ఇప్పటికే ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. ఆమె మంగళవారం మద్యాహ్నం నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది.