ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతోన్న సంగతి తెలిసిందే. కొంత మంది కీలక నేతలు ఇప్పటికే సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన ఇంకొంత మంది నేతలు ఇప్పుడు ఒక్కొక్కరిగా జైలు కెళ్తున్నారు. ఇది జగన్ క్షక్షసాధింపు చర్యలా? మరొకటా? అన్నది పక్కనబెడితే ! పసుపు దళం మాత్రం బలహీనంగా మారుతోన్న మాట వాస్తవం. ఇప్పటికే ఉన్న 20 మంది ఎమ్మెల్యేలను ఎలా? కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు సతమతమవుతున్నారు. అధికార పార్టీ వైకాపా ఫిరాయింపులకు పాల్పడుతోందని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ పీఠమెక్కిన 16 నెలల నుంచి చంద్రబాబు అండ్ కో అదే పని మీద కంకణం కట్టుకుని చేస్తుంది. అయినా వాటిని డోంట్ కేర్ అంటూ జగన్ ముందుకెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కొత్త ప్రచారం ఒకటి తెరపైకి వచ్చింది. ఎందుకంటే బాబాయ్ అచ్చెన్నాయుడు కోసమని అంటున్నారు. అచ్చెన్న ఈఎస్ ఐ కుంభ కోణంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అదిష్టానం సహా అచ్చెన్న ఫ్యామిలీ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించని సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటీషన్ ని ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు కూడా కొట్టేయడంతో పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో అచ్చెన్న అసలు బయటకు వస్తారా? అన్న అనుమానం కలుగుతోంది. అందుకే టీడీపీలో ఉంటే రామ్మెహన్ నాయుడు బాబాయ్ ని బయటకు తీసుకురావడం కష్టమని భావించి బీజేపీలో చేరాలని భావిస్తున్నారుట. ఇప్పటికే బీజేపీ పంచన చేరిన, రామ్మోహన్ నాయుడుకి బాగా సన్నిహితుడైన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో కూడా మాట్లాడినట్లు సమాచారం. బాబాయ్ పరిస్థితిని..తన రాజకీయ భవిష్యత్ గురించి సుజనతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రామ్మోహన్ నాయుడికి చంద్రబాబు నాయుడు వేసే పెద్ద పీట గురించి చెప్పాల్సిన పనిలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి రామ్మోహన్ పసుపుదళానికి ఏకైకా బలమైన నాయకుడు. దివంగత నేత ఎర్రం నాయుడు కుమారుడు. కాబట్టే చంద్రబాబు మొదటి నుంచి రామ్మోహన్ ని నెత్తిన పెట్టుకున్నారు. పార్టీ కోసం, చంద్రబాబు కోసం ఆయన అంతే విథేయుడిగా పనిచేసారు. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు రామ్మోహన్ కి అప్పగించినా ఆశ్చర్య పోనవసరం లేదని వైకాపా ఆరోపించిందంటే? టీడీపీలో రామ్మోహన్ నాయుడి స్థాయి ఏంటన్నది ఏపీ ప్రజలకు తెలుస్తున్నదే. అలాంటి నేత పార్టీ మారితే కమలదళం మధ్య ఇమగడగలరా? అన్నది ఆలోచించాల్సిన విషయమే.