పవన్ కళ్యాణ్‌కి రాజ్యసభ సీటు ఫిక్సయ్యిందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చూపబోయే ప్రభావమేంటన్నది 2024 ఎన్నికలతో తేలిపోతుంది. ఆల్రెడీ ఓ సారి తేలిపోయింది.. ఇంకోసారి తేలిపోవడమొక్కటే బాకీ వుంది.! అయితే, 2019 ఎన్నికలతో పోల్చితే, జనసేనకు బెటర్ రిజల్ట్ 2024 ఎన్నికల్లో వచ్చే అవకాశముంది.

రాష్ట్రంలో ఓ డజను అసెంబ్లీ సీట్లు జనసేన గెలుచుకున్నా, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీతో సఖ్యతతో వుండాలి.. అదే సమయంలో.. కేంద్ర ప్రభుత్వంలోనూ భాగమయి వుండాలి. అలా జరిగితేనే, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల తర్వాత కాపాడుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడున్న గోడ దూకుడు రాజకీయాలు అలాంటివి.

అదేం లేదు, జనసేన అధికారంలోకి వస్తుంది.. అని జనసేన నేతలెవరైనా బలంగా చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.! ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్న కోణంలో తప్ప, జనసేనకు ప్రస్తుతం ఆ అవకాశమైతే లేదు.

ఇదిలా వుంటే, జనసేనానికి రాజ్యసభ సీటుని ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వం ఆఫర్ చేసిందట. ప్రస్తుతానికి ఆ ఆఫర్‌ని జనసేనాని సున్నితంగా తిరస్కరించినా, ఆ ఆఫర్ లైవ్‌లోనే వుంటుందనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదిగే క్రమంలో భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్‌ని వ్యూహాత్మకంగా తమ అవసరాలకనుగుణంగా వినియోగించుకుంటోంది. అయితే, ఈ వాడకం అనేది.. ఇరువురికీ లాభదాయకంగానే వుండబోతోంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి క్లియర్ మెజార్టీ వస్తేనే.. ఇప్పుడున్న ఈక్వేషన్ వర్తిస్తుంది. ఏదన్నా తేడా వచ్చి, వైసీపీ అవసరం వస్తేనో.? అప్పుడు లెక్కలు మారిపోతాయ్.!