Rajya Sabha Elections: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తమ పార్టీ నుంచి నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్ని ఖారారు చేయాల్సి వున్న సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు సీట్లు ఏపీ నుంచి ఖాళీ అవగా, అన్ని స్థానాలూ వైసీపీకే దక్కనున్నాయి. నాలుగు సీట్ల కోసం ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా వుంది.
మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి సహా, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి (రెన్యువల్), బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యతోపాటు ప్రముఖ సీనియర్ న్యాయవాది, సినీ నిర్మాత నిరంజన్‌రెడ్డికి కూడా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ అవకాశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, నిరంజన్ రెడ్డి అలాగే ఆర్ కృష్ణయ్య.. ఈ ఇద్దరూ తెలంగాణకు చెందినవారే కావడం గమనార్హం. మొత్తం ఐదుగురి పేర్లు దాదాపు ఖరారు కాగా, అందులోంచి నలుగురికి అవకాశం దక్కనుంది. ఛాన్స్ దక్కనివారెవరన్నదానిపై సాయంత్రంలోగా స్పష్టత రాబోతోందిట.
ఇదిలా వుంటే, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి తన పదవీ కాలం ముగిశాక, మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరగా, సమీకరణాలు పరిశీలిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారట. అయితే, పదవులపై తనకు ఆశ లేదనీ, అధినేత ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాననీ విజయసాయిరెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
విజయసాయిరెడ్డికి ఈసారి పదవి రెన్యువల్ అవడం కష్టమేనన్న ప్రచారం జోరుగా సాగింది. అనూహ్యంగా ఆయనకు మరోమారు రాజ్యసభ అవకాశాన్ని అధినేత కట్టబెట్టడం దాదాపు ఖాయమైపోయింది.