చిలకలూరిపేటలో ఆయనతో కలిసిపోతా అంటున్న రజిని విడదల (వీడియో)

చిలకలూరిపేటకు చెందిన ఎన్నారై మహిళ, వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ రజిని విడదల వైసీపీలో చేరారు. ఆమె మూడు రోజుల క్రితం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న యలమంచిలి నియోజకవర్గం రేగుపాలెంలో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్ గా నియమిస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఆమె పార్టీలో చేరినప్పటి నుండి చిలకలూరిపేట రాకీయాలు రసవత్తరంగా మారాయి.

రజిని విడదల పార్టీలో చేరినప్పటి నుండి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. “జగన్ ఆమెకు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. దీంతో గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ వీడే ఆలోచనల్లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి”.

కాగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావును ఓడించే సత్తా తనకే ఉందంటూ గతంలో పలుమార్లు రజిని విడదల ఛాలెంజ్ చేశారు. “ఆర్ధికంగా కూడా విడదల రజిని బలంగా ఉన్నారు. ఇప్పటికే పలుసేవ కార్యక్రమాలతో చిలకలూరిపేట ప్రజలకి చేరువయ్యారు. ఈనేపధ్యంలో ప్రత్తిపాటిని ఓడించగలదు అనే నమ్మకంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వనున్నట్లు జగన్ హామీ ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి”. అయితే ఇవన్నీ అవాస్తవమని తెలుస్తోంది.

తాజాగా ఆవిడ ప్రెస్ మీట్ లో విలేఖరులతో మాట్లాడారు. జగన్ ఆమెను పార్టీలో చేర్చుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అందరిని కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి తోడ్పడతానంటూ వెల్లడించారు. మర్రి రాజశేఖర్ వివాదంపై స్పందించిన ఆమె…పార్టీలో చేరేముందు ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాను అన్నారు. ఆరోజు రాజశేఖర్ గారికి తిరుపతి ప్రయాణం ఉండటం వలన నేను పార్టీలో చేరే కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు అని తెలిపారు. రానున్న కాలంలో మర్రి రాజశేఖర్ గారు, నేను కలిసి చిలకలూరిపేట అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కలిసి పని చేస్తూ ముందుకు పోతామని ఆవిడ స్పష్టం చేశారు. కింద వీడియో ఉంది చూడవచ్చు.