2024 ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎవరెవరు బరిలో నిలవబోతున్నారు.? సిట్టింగ్ ఎంపీ భరత్, వైసీపీ నుంచి ఇంకోసారి నిలబడే అవకాశాలెంత.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతానికైతే భరత్ ఇక్కడి నుంచి పోటీ చేసే విషయమై పెద్దగా వైసీపీ అధినాయకత్వానికి వేరే ఆలోచనలు లేనట్టు తెలుస్తోంది.
కానీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ఓ ‘బడా బాబుని’ రంగంలోకి దించబోతోందట. 2024 ఎన్నికల్లో ఇదే అత్యంత ఖరీదైన నియోజకవర్గం కాబోతోందన్నది ప్రస్తుతం రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని జనంలో జరుగుతున్న చర్చ. ఇక, జనసేన పార్టీ తరఫున కూడా బలమైన క్యాండిడేట్ బరిలోకి దిగే అవాకాశాలున్నట్లు తెలుస్తోంది. జనసేన – బీజేపీ మధ్య ఇప్పటికే ఈ విషయమై అవగాహన కుదిరిందట. ఒకవేళ టీడీపీ గనుక కలిస్తే.. అప్పుడు కూడా జనసేన అభ్యర్థే బరిలో వుంటారని అంటున్నారు.
‘అబ్బే, అలాంటిదేం లేదు. ఈసారి రాజమండ్రి మాదే..’ అని స్థానికంగా తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నా, జనసేన వైపే టీడీపీ అధినాయకత్వం రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం విషయమై మొగ్గు చూపుతోందని సమాచారం. కానీ, టీడీపీ నుంచి బరిలోకి దిగాలనుకుంటున్న అభ్యర్థి మాత్రం.. ఎంతైనా ఖర్చు చేస్తానంటున్నాడట.
ఈ నేపథ్యంలో అధికార వైసీపీ కూడా చివరి నిమిషంలో పునరాలోచన చేయొచ్చనీ, అదే జరిగితే భరత్ కంటే ఆర్థికంగా బలంగా వున్న అభ్యర్థిని నిలబెట్టొచ్చనీ అంటున్నారు.